తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణిస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా జగన్ వెళ్లలేదు. ఆయన మృతదేహానికి నివాళి అర్పించలేదు. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో దళిత ఎంపీ అయిన దుర్గాప్రసాద్ ను కనీసం పరామర్శించకపోవడంతో క్రైస్తవ దళితులను తప్ప హిందు దళితులను జగన్ పట్టించుకోరన్న విమర్శలు చేశారు తెలుగుదేశం నేతలు.
అయితే, దుర్గాప్రసాద్ మరణం తర్వాత కుటుంబాన్ని పరామర్శించడం పక్కన పెడితే…. ఇపుడు సానుభూతి కింద ఆ కుటుంబానికి సీటు ఇవ్వడానికి కూడా జగన్ కి ఇష్టం లేదని తెలుస్తోంది. తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి ఆ సీటు కట్టబెట్టి… తన ఎంపీలు, ఎమ్మెల్యేలను తనకు ఎలా విధేయతగా ఉండేవాళ్లను ఎంచుకుంటానో చూడండి అన్న సందేశం పార్టీకి పంపడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే గురుమూర్తి పేరు బయటకు రాగానే జగన్ పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక స్టోరీ తయారుచేసింది వైకాపా. మేము బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికే ఇద్దాం అనుకున్నాం. కానీ వారికే ఇష్టం లేక తీసుకోలేదు అన్న ఒక ఫీల్ జనంలోకలిగించడానికి వైకాపా మీడియా ద్వారా ఒక స్టోరీ క్రియేట్ చేశారు వైకాపా నాయకులు.
తిరుపతి అభ్యర్ధి ఎంపిక విషయమై గురువారం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంఎల్ఏల సమావేశం జరిగిందట. ఈ సమావేశంలో ఉపఎన్నిక విషయమై సుదీర్ఘంగా చర్చ జరిగిందట. అభ్యర్ధి ఎంపిక విషయాన్ని అందరు కలిసి జగన్ కే అధికారం అప్పగించేశారట (అంతకుమించి ఏం చేస్తారు). మంత్రులు, ఎంఎల్ఏల దృష్టిలో గట్టి అభ్యర్ధి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు పెద్దగా స్పందించలేదట. దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం నుండే ఒకరిని పోటీ చేయించాలని డిసైడ్ అయ్యిందట. ముందుగా దుర్గా ప్రసాదరావు కొడుకు కల్యాణ చక్రవర్తికి అవకాశం ఇస్తే బాగుంటుందని మంత్రులు సూచించారట సమాచారం. ఒక వేళ పోటీ చేయటానికి కొడుకు ఇష్టపడకపోతే అపుడు దివంగత ఎంపి భార్యకు అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకున్నారట. జగన్ సానుకూలంగా స్పందించారట. బల్లి కుటుంబంతో మాట్లాడాలని మంత్రులకు జగన్ బాధ్యత అప్పగించారట. కుటుంబంతో మంత్రులు మాట్లాడి వాళ్ళ ఆలోచనలేమిటో తెలుసుకున్న తర్వాత మళ్ళీ సీఎంతో చర్చించాలని డిసైడ్ అయ్యింది. అంటే పోటీ చేసే అవకాశం ముందు బల్లి కుటుంబసభ్యులకే దక్కుతుందని , పార్టీ ఇవ్వాలనుకుందని ప్రచారం చేశాక…. వారే వద్దనుకుంటే అపుడు గురుమూర్తికి ఇస్తారట.
కథ అదిరిపోయిందిగా… అయినా ఇంత డొంక తిరుగుడు ఎందుకు… నచ్చినోళ్లకు ఇచ్చేస్తే పోలా…!!