దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీలో దురాశను పెంచింది. వాస్తవానికి తెలంగాణ దుబ్బాకలో ప్రతి ఓటు కేసీఆర్ మీద అసహన ఓటే. వాపును చూసి బలుపు అనుకుంటున్న ఏపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో దురాశకు పోతోంది. దుబ్బాక లెక్కలు తిరుపతిలో కూర్చుని రాసుకుందాం అనుకుంటోంది.
దుబ్బాకలో గెలిచి రెండ్రోజులు కాలేదు అపుడే తిరుపతిలో మీటింగ్ పెట్టడం వెనుక బీజేపీ అతివిశ్వాసం చూసిన రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.తిరుపతిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది బీజేపీ. దీని ఉద్దేశం ఏంటో తెలుసా… తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచాం, తిరుపతి ఉప ఎన్నికలో గెలుస్తాం అన్న ప్లాన్. ఇది మామూలు దురాశ కాదు.. ఓ రేంజ్ దురాశ. పార్టిని అయినా, మనిషిని అయినా ఆశ బతికిస్తుంది, దురాశ చంపేస్తుంది.
బీజేపీ తిరుపతి మీటింగ్ హైలెట్స్ చూస్తే మన నోట మాట రాదనుకోండి. బీజేపీ సమావేశం అంటే ఎవరిని పొగడాలి… అయితే, వాజపేయిని, లేదా అద్వానీని, లేటెస్ట్ అంటే మోడీని పొగడాలి. కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని ఆకాశానికి ఎత్తేశారు ఈ మీటింగులో ఎన్టీఆర్ బాహుబలి అని కీర్తించింది.
ఏందయ్యా కారణం అంటే… ఇపుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి పురంధేశ్వరికి ఇచ్చారు కదా కాబట్టి…. ఆమెను చూసి ఎన్టీఆర్ అభిమానులంతా ఓట్లు గుద్దేసి తిరుపతిలో గెలిపించాలట.అది సరే… పక్కనే ఉన్న రాజంపేటలో పోటీ చేస్తే పురంధేశ్వరికి వచ్చిన ఓట్లెన్నో బీజేపీ మరిచిపోయినట్టుంది.
పురంధేశ్వరిని బీజేపీ రాజంపేటలో నిలబెడితే అక్కడ తరిమేశారు. విశాఖలో నిలబెడితే అక్కడ తరిమేశారు… అలాంటిది ఇపుడు ఆమె చెబితే ఓట్లేస్తారా? నిలువునా ఏపీని చీలుస్తుంటే కళ్లప్పగించి చూస్తూ పదవిని ఎంజాయ్ చేసిన మహా వనిత పురంధేశ్వరి.
ఇక చీరల నిపుణులు విష్ణురెడ్డి గారు ఒక ట్వీటేశారు… ‘బీజేపీ దుబ్బాకలో గెలిచినట్లే తిరుపతిలో గెలుస్తుంది అంట‘… దేంతో నవ్వాలో అర్థం కాదు ఆయన ట్వీటు చూసి. అసలు అభ్యర్థి ఎవరు? ఆయన బలం ఏంటో తెలియదు… కానీ గెలుపు ఖాయమైపోయిందట. మోడీ మోసాన్ని ఎవరు మరిచినా ఆ తిరుపతి ప్రజలు మరిచిపోరు. అక్కడ నుంచే ఏపీకి ఢిల్లీకి మించిన రాజధాని కట్టిస్తాను అని నరేంద్ర మోడీ అబద్ధపు హామీ ఇచ్చారు. మరి దానిని మరిచిపోయి తిరుపతి వాళ్లు మోడీకి ఓట్లేస్తారా?