రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక అందివచ్చిన వరంగా మారనుందా? తమ పోరును ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువె ళ్లిన రైతులకు తిరుపతి ఉప పోరు.. మరింతగా తమ వాయిస్‌ను జాతీయస్థాయికి వినిపించడంతోపాటు.. కీలక పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టేందుకు.. అత్యంత కీలకమైన, రాష్ట్ర భవితను నిర్దేశించే సమస్యను ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు కలిసి కట్టుగా పరిష్కరించేందుకు లేదా జగన్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగ పడనుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
అంతేకాదు.. తిరుపతి ఉప పోరులో రైతులు భారీగా పోటీకి దిగడం ద్వారా జాతీయ స్థాయి మీడియాలోనూ తిరుపతి ఉప ఎన్నికల నామినేషన్ వ్యవహారం భారీగా ఫోకస్ కావడంతోపాటు.. ఉద్యమం ఢిల్లీ వీధుల వరకు మరింత వేగంగా పుంజుకునేందుకు, బలపడేందుకు.. దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో త్వరలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
పసుపు రైతులే ప్రతీక!
అయితే, ఈ ఉప ఎన్నికను రాజధాని రైతులు అందిపుచ్చుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. గతంలో పలు రాష్ట్రాల్లో రైతులు తమ డిమాండ్లను సాధించుకునేందుకు ఎన్నికలను ఆయుధంగా వినియోగిం చుకున్నారు. తమిళనాడులోను, తెలంగాణలోను కూడా రైతులు దుమ్మురేపి.. ప్రదాన పార్టీలకు ముచ్చె మటలకు పట్టించారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు ఎన్నికలు జరిగినప్పుడు.. అక్కడి పసుపు రైతులు ఏకంగా 500 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇక్కడ రైతులు ఉద్యమించారు. ఇక, తమిళనాడుకు చెందిన రైతులు కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగారు.
మోడీకే సెగపుట్టింది!
ఏకంగా తమిళనాడు.. రైతులు తమకు న్యాయమైన ధరలను ఇప్పించాలనే డిమాండ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ పోటీకి దిగిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో 111 నామినేషన్లు వేశారు. దీంతో జాతీయ స్థాయిలో వీరి సమస్యలు చర్చకు వచ్చాయి. కీలక పార్టీలు కూడా చెమటలు కక్కుకుని ఆయా సమస్యల కు పరిష్కారం చూపిస్తామంటూ.. ముందుకు వచ్చాయి. అప్పటి వరకు పట్టించుకోని వారు కూడా జాతీయ స్థాయిలో ఈ విషయాలు చర్చకు రావడంతో పట్టించుకున్నారు. రైతుల గోడు విన్నారు. ఇప్పుడు ఇదే మాదిరిగా .. అమరావతి రైతుల సమస్యను జాతీయ స్థాయిలో మరింత తీవ్రంగా వినిపించేందుకు తిరుపతి ఉప పోరు కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది.
జాతీయస్థాయిలో చర్చకు ఛాన్స్
కనీసం 150 నుంచి 200 నామినేషన్లు పడితే.. కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్‌ను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. పైగా ఇది జాతీయ స్థాయిలో చర్చకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా నామినేషన్ రుసుము కూడా ఉండదు. సాధారణంగా నియోజకవర్గానికి రూ.25 వేల చొప్పున డిపాజిట్ చేయాలి. కానీ.. ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు 12500 కడితే సరిపోతుంది. దీనిని బ్యాంకుల్లో చెల్లించవచ్చు లేదా నేరుగా రిటర్నింగ్ అధికారికి కూడా ఇవ్వొచ్చు. అభ్యర్థులే నేరుగా నామినేషన్ వేయాల్సిన అవసరం కూడా లేదు. వారిని బలపరుస్తున్నవారు కూడా నామినేషన్ దాఖలు చేయొచ్చు.
బలపరిచేవారుంటే చాలు!
అయితే, నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే నామినేషన్ పత్రాలను ఇచ్చేందుకు అవకా శం ఉంటుంది. సాధారణంగా గుర్తించిన రాజకీయ పార్టీల నుంచి లేదా.. బలపరిచిన అభ్యర్థుల ద్వారా కూడా నామినేషన్ వేయొచ్చు. అదేసమయంలో ఇండిపెండెట్లు పోటీ చేయాల్సి వస్తే.. కనీసం పది మంది అభ్యర్థులు తమనుబలపరిచినట్టు అఫిడవిట్ ఇస్తే చాలు. 25 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులే. అదేసమయంలో వారు భారతీయ పౌరుడై, నివసిస్తున్న ప్రాంతంలో ఓటు హక్కును కలిగి ఉంటే చాలు. అయితే.. కేసులు, జైళ్లలో ఉన్న వారి విషయంలో కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.
అర్హత పత్రాలు ఇవే
లోక్‌సభ కు పోటీ చేయాలంటే.. ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత ఫార్మ్ 2ఏను రిటర్నింగ్ అధికారికి ఉదయం 11 నుంచి మద్యాహ్నం 3లోగా సమర్పించాలి. అదేవిధంగా బలపరిచే వారి నుంచి అఫిడవిట్లు తీసుకోవాలి. పోటీ చేసే అభ్యర్థి, బలపరిచేవారు కూడా ఆయా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి సంబంధిత నియోజకవర్గానికి చెంది ఉండకపోతే.. అవసరమైన ఎలక్టోరల్ రోల్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
నిరక్షరాస్యులూ అర్హులే!
అక్షర జ్క్షానం లేదు.. మేం పోటీకి అర్హులమా? అనే సందేహం అక్కరలేదు. వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. వారి వేలిముద్రను ప్రామాణికంగా తీసుకుని నామినేషన్ వేసేందుకు అనుమతిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు కుల ధ్రవీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలి. అదేవిధంగా ఫార్మ్ 26 ద్వారా అఫిడవిట్ ఇవ్వాలి. నోటరీ చేయించడం లేదా కమిషనర్, మెజిస్ట్రేట్ ల వద్ద ప్రమాణం చేయడం ద్వారా వీటిని టైపు చేయించి కూడా అఫిడవిట్‌గా ఇచ్చే అవకాశం ఉంది. నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ ఇవ్వలేక పోతే.. నామినేషన్లకు చివరి రోజు కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది.
ఎవరి ఎన్ని నామినేషన్లు వేయాలి!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రెండు చోట్ల నుంచి ఒకే సారి పోటీ చేయొచ్చు. అదేవిధంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను కూడా ఇవ్వొచ్చు. అయితే.. డిపాజిట్ మాత్రం ఒకదానికి చెల్లిస్తే సరిపోతుంది.
రాజధాని రైతులకు అందివచ్చిన అవకాశం
తిరుపతి ఉప పోరు.. రాజధాని రైతులకు అందివచ్చిన వరం వంటిదేనని అంటున్నారు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న మేధావులు. రైతులు తమ గళాన్ని ఇప్పటి వరకు వినిపించినా.. పార్టీలు తేలికగా తీసుకున్నందున.. ఇప్పుడు వారు కనుక వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తే.. పార్టీలే వారి వద్దకు వచ్చి సమస్య వినేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.