త్వరలోనే దేశవ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు, తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించింది. తిరుమలకు ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని వెల్లడించింది. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో ఏడాదిలో 500 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 18 నెలల్లో కశ్మీర్ లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ప్రతి గుడిలో ఓ గోమాతను ఉంచుతామని, దాదాపు 100 గుళ్లలో ఈ విధానం అమలులో ఉందని చెప్పారు. టీటీడీ పరిధిలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ కు కొత్త విధానం తెస్తున్నామన్నారు.
వరాహ స్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు చేస్తున్నామని సుబ్బారెడ్డి వెల్లడించారు. గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేద్యం సమర్పిస్తున్నామని తెలిపారు. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామన్నారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని తెలిపారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామని, గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేశామన్నారు.