అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తీరథ్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన మూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేసిన ఆయన.. బీజేపీ అధినేతలతో భేటీ కావటం.. చివరకు రాత్రివేళలో హడావుడిగా రాజీనామా చేయటం ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. అందుకు శనివారం ఉదయం 11 గంటల వేళలో రాజ్ భవన్ కు వెళుతున్నట్లుగా ప్రకటించిన ఆయన.. అనూహ్యంగా అంతకు ముందే.. లేట్ నైట్ లో వెళ్లి రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. అంత హడావుడిగా రాత్రిపూట వెళ్లి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం ఆయన గర్హ్వాల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి తొమ్మిదిన ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేయటంతో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేత ఎవరైనా సరే.. తాను ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆర్నెల్ల వ్యవధిలోపు స్థానిక అసెంబ్లీ నుంచి కానీ మండలి నుంచి కానీ ఎంపిక కావాల్సి ఉంది.
అంటే.. సెప్టెంబరు 10లోపు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. రాష్ట్రంలో గంగోత్రి.. హల్ద్వానీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పట్లో జరిగే వీల్లేదు. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికల్ని వెంటనే నిర్వహించే అవకాశం కనిపించటం లేదు. దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అధిష్ఠానం సూచనల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లుగా సమాచారం.
2013-15 మధ్య కాలంలో ఉత్తరాఖండ్ బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాలుగు నెలలకే రాజీనామా చేయాల్సి రావటం గమనార్హం. ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే.. రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే అవకాశం ఉండటంతో.. ఆయన్ను పదవి నుంచి తప్పిస్తున్నట్లుగా చెబుతుున్నారు. అందుకు ప్రతిగా కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
నాలుగు నెలల లోపే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని మార్చిన నేపథ్యంలో ఈసారి సీఎంగా ఎంపిక చేసే నేతను అసెంబ్లీ నుంచి ఎంపికైన వారికే అవకాశం ఇవ్వాలని మోడీషాలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం రేసులో సత్ పాల్ మహారాజ్.. బంశీధర్ భగత్.. హరక్ సింగ్ రావత్.. ధన్ సింగ్ రావత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం మూడు గంటల వేళలో బీజేపీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.