“ఇప్పుడు నా ప్రసంగం పూర్తి కాగానే.. అధికారులు మీకు పట్టాలు ఇస్తారు. వాటితోపాటే తాళాలు కూడా ఇస్తారు. ఆ వెంటనే మీరు.. మీ ఇంటిని సొంతం చేసుకుని..అందులోనే నిశ్చింతగా ఉండొచ్చు. ఇది ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి.. మీ తమ్ముడు, మీ అన్నయ్య ఇస్తున్న కానుక“ -ఇదీ.. ఇటీవల గుడివాడలో సీఎం జగన్.. టిడ్కో గృహాలను ప్రారంభించి.. చెప్పిన మాట.
ఇది జరిగివారం జరిగిపోయింది. జగన్ ప్రారంభించి కూడా అంతే సమయం అయింది. కానీ, ఇప్పటికీ.. ఇక్కడ పరిస్థితి గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎన్నోళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా ఎట్టకేలకు గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్లాట్లను సీఎం జగన్ పంపిణీ చేసినా నేటికీ ఇళ్లకు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన ఇల్లు కూడా ఇప్పటికీ తాళం వేసే ఉండడంతో అందరూ నివ్వెర పోతున్నారు.
అయితే.. ఇళ్లను సొంతం చేసుకున్న లబ్ధిదారులు తమ బంధువులతో వచ్చి ఇదే తమ ఇల్లు అంటూ తాళాలు వేసిన ఇంటిని చూపిస్తున్నారు. కొందరు యువకులు కిటికీల్లోంచి చూసేందుకు ప్రయత్నిస్తున్నా రు. అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టినప్పటికీ మౌలిక వసతుల లేమి కనిసిస్తూనే ఉంది. తాగునీటి ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తి కాలేదు. పైపులైను పనులు కొనసాగుతున్నాయి.
సీఎం ఇళ్ల పంపిణీ చేయగానే కంచం, మంచంతో ఇంట్లోకి వచ్చేయవచ్చని ఎంతో గర్వంగా వైసీపీ నేతలు, ముఖ్యంగా గుడివాడ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. కానీ, మాటలు చెప్పినట్టుగా మాత్రం ఇక్కడ చేతలు లేకపోవడంతో లబ్ధి దారులు ఉసూరు మంటున్నారు. పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. పైగా లబ్ధిదారులకు ఇళ్ల తాళంచెవులు ఇవ్వకుండానే జియోట్యాగింగ్ కోసం ఇంటి వద్దకు రావాలని సచివాలయ సిబ్బంది కోరుతున్నట్టు చెబుతున్నారు. సో.. వీటిని గమనించినవారు.. ఏపీ సర్కారుతో పెట్టుకుంటే.. ఇట్టుంటది అనివ్యాఖ్యానిస్తున్నారు.