టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ రేట్లు కూడా ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి.
మార్చి 25న ఈ చిత్రం విడుదల కాబోతోన్న నేపథ్యంలో టిక్కెట్ రేట్లను పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ చిత్రం విడుదలైన తొలి మూడు రోజులు అంటే మార్చి25-మార్చి27 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, తర్వాత వారం రోజులు అంటే మార్చి28-ఏప్రిల్3 వరకు రూ.50 పెంచుకోవచ్చని జీవోలో పేర్కొంది. ఇక, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.50, ఆ తర్వాత వారం రోజుల పాటు రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలైన పది రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇక, తొలి 3 రోజులవరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.233గా, మల్టీప్లెక్స్‌లో రూ.413 గా నిర్ణయించారు.
ఏపీలో తెలంగాణ స్థాయిలో పెంచకపోయినా…గత చిత్రాలతోపోలిస్తే భారీగా పెంచినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రానికి రూ.75 వరకు టికెట్ రేటు పెంచుకోవచ్చని జగన్ సర్కార్ తెలిపింది. కార్పోరేషన్లో సింగిల్ స్క్రీన్లలో రూ.236, మల్టీప్లెక్స్‌లలో రూ.265గా ఉండగా,మున్సిపాలిటీలో సింగిల్ స్క్రీన్‌లో రూ.206, మల్టీప్లెక్స్‌లలో రూ.236 గా టికెట్ రేటు ఉండనుంది. ఇతర ప్రాంతాలలో సింగిల్ స్క్రీన్‌లో రూ.195 మల్టీప్లెక్స్‌లో రూ.206గా పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రేట్లు చిత్రం విడుదలైన 10రోజుల వరకు వర్తిస్తాయి.