తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, అసెంబ్లీలో ప్రకటించిన దానికి తాను కట్టుబడి ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ విషయంపై టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని, ఆ విషయాలపై చర్చ జరగలేదని దిల్ రాజ్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇంపార్టెంట్ కాదని దిల్ రాజు అన్న మాటలు వైరల్ గా మారాయి. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలాగా ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు.
హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని దిల్ రాజు చెప్పారు. తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్‌కు, ప్రభుత్వానికి గ్యాప్ రాలేదని, సీఎంతో సానుకూల వాతావరణంలో భేటీ జరిగిందని అన్నారు. తమకు సీఎం రేవంత్ పెద్ద టాస్క్ ఇచ్చారని, ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా టాలీవుడ్ పెద్దలతో కలిసి చర్చిస్తానని దిల్ రాజు తెలిపారు. ఏది ఏమైనా ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవన్న వార్తపై మాత్రం ఇండస్ట్రీ వర్గాలు సంతోషంగా లేవని తెలుస్తోంది.