దాయాది దేశం పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు.. వీటికి మించి.. ఐదేళ్ల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పాల్గొనకుండా.. నిషేధం విధించింది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఇమ్రాన్‌ఖాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు.
ఏం జరిగింది?
గతంలో పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్ విదేశీ పర్యటనలకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఆయా దేశాలు గౌరవార్థం కొన్ని బహుమతులు ఇచ్చారు. వీటిని తోషాఖానా అంటారు. మన దేశంలో మాదిరిగా ప్రధాని ఇష్టప్రకారం వాటిపై హక్కులు ఉండవు. ఏది వచ్చినా పాకిస్థాన్ ప్రభుత్వానికి బహుమానం వచ్చిందని భావిస్తారు. దీనిని వేలంలో విక్రయించి.. వచ్చిన సొమ్ములో 25శాతం ప్రధాని తీసుకుని.. మిగిలిన సొమ్మును ప్రభుత్వానికి అప్పగించాలి.
అయితే.. ఇలా వచ్చిన బహుమానాలను ఇమ్రాన్‌ఖాన్ ఎలాంటి వేలం నిర్వహించకుండానే విక్రయించి.. సొమ్ము చేసుకుని.. ప్రభుత్వానికి 5శాతం ఇచ్చి 95 శాతం నిధులు తనే తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. దీనిని దేశ ద్రోహం కింద పరిగణిస్తారు. ఈ క్రమంలో ఆయనపై రెండేళ్ల కిందటే కేసు నమోదైంది. ఇక, దీనికి తోడు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లోనూ అక్రమాలు ఉన్నాయని మరో కేసు నమోదైంది. మొత్తానికి ఆయా కేసులను విచారించిన ట్రయల్తాజాగా ఆయనకు శిక్ష విధించింది.
మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించింది. ఈ జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.