తల్లిదండ్రులతో తర్వాత దైవంగా కొలిచే గురువు స్థానానికి కళంకాన్ని అపాదించే ఘటనలు కొద్దికాలంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వెలుగు చూసిన దారుణ ఘటన చూస్తే.. మనసు వేదనతో నిండిపోతుంది. తమిళనాడులో చోటు చేసుకున్న టీచర్లు చేసిన అరాచక ఉదంతం బయటకు వచ్చి సంచలనంగా మారింది. సభ్య సమాజంలో ఏ సంఘటనలు అయితే చోటు చేసుకోకూడదో.. అలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవటంపై ప్రభుత్వాలు ఫోకస్ చేసి.. ఇలాంటి అక్రత్యాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒక డిగ్రీ టీచర్ కలిసి పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చటంతో.. తల్లిదండ్రులు ఆమెకు అబార్షన్ చేయించే వేళలో ఈ దారుణం వెలుగు చూసింది. జరిగిన ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.
దీనిపై స్పందించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. బర్గూరు మహిళా పోలీస్ స్టేషేన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. బాలికపై దారుణానికి ఒడిగట్టిన 57 ఏళ్ల చిన్నసామి.. 45 ఏళ్ల అర్ముగం.. 37 ఏళ్ల ప్రకాశ్ ను అరెస్టు చేశారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. బాధిత బాలికను క్రిష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాడులో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయని పేర్కొంటూ స్టాలిన్ పాలనపై విమర్శలు గుప్పించారు.