తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. విధుల్లో పక్షపాతం ప్రదర్శించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పరిణామం తెలంగాణ అధికార పక్షానికి దెబ్బగా చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక అపార్టు మెంట్ వద్దకు వెళ్లిన పోలీసులు.. రూ.18 లక్షల క్యాష్.. చెక్ బుక్.. రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. ఈ అపార్టు మెంట్ లో ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయసింహా నివాసం ఉంటున్నారని చెబుతున్నారు. ఇక్కడ జయసింహ స్నేహితులు ఇద్దరు (సంతోష్.. సుధాకర్) నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకోవటంతో పాటు.. పంపిణీ చేస్తున్న ఆరోపణలతో పట్టుకున్నారు. పట్టుబడిన నగదు ముఠా జయసింహాదిగా భావిస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
అయితే.. నిందితులను అరెస్టు చేయకపోవటం.. సరైన సెక్షన్లతో కేసు నమోదు చేయకపోవటంతో పాటు.. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించినట్లుగా ఫిర్యాదులు అందాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వెంటనే.. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్.. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి.. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ తాజాగాహైదరాబాద్ కమిషనరేట్ సీపీ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండ్ చేసిన అధికారుల స్థానంలో ముషీరాబాద్ స్టేషన్ లో పని చేస్తున్న డీఐ వెంకట్ రెడ్డిని.. చిక్కడపల్లి ఏసీపీగా ఉన్న మధుమోహన్ రెడ్డిని.. సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్న డి. శ్రీనివాస్ ను నియమిస్తూ నిర్నయం తీసుకున్నారు. ప్రస్తుతం డి. శ్రీనివాస్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 3గా ఉన్నారు. ఏమైనా.. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. పక్షపాతంగా నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఒక డీసీపీ.. ఏసీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం అధికార పార్టీకి ఎదురుదెబ్బగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.