ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్.. ఈ మూడు లోక్ సభ నియోజకవర్గ స్థానాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ? నామినేషన్ల దాఖలుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ టికెట్ల ఖరారు వ్వవహారం కాకలు రేపుతున్నది. ముఖ్యంగా ఖమ్మం అభ్యర్థి ఖరారు అంశం కాంగ్రెస్ లో ఆధిపత్య పోరుకు తెరలేపింది.
ఈ స్థానం నుండి పోటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ లు ముందుకు వచ్చారు. మంత్రుల కుటుంబాలు వద్దనడంతో పొంగులేటి తన వియ్యంకుడు రఘురాంరెడ్డిని తెరమీదకు తెచ్చాడు. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట రెడ్డి అభ్యర్థి వద్దనడంతో మల్లు భట్టి విక్రమార్క స్థానికుడు అయిన రాయల నాగేశ్వర్ రావును తెర మీదకు తీసుకురాగా, ముఖ్యమంత్రి రేవంత్ నిజామాబాద్ కు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావును తెరమీదకు తెచ్చాడు. దీంతో ఈ టికెట్ పంచాయతీ బెంగుళూరులో పార్టీ అధ్యక్షుడు ఖర్గే కోర్టులోకి వెళ్లింది. అక్కడ మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటిలు ఆయనతో భేటీ అయ్యారు.
ఖమ్మం టికెట్ పంచాయతీ అలా నడుస్తుండగానే కరీంనగర్ నుండి ఎంపీగా కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేశ్వర్ రావు మంత్రి పొన్నం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం స్థానం రెడ్డికి కరీంనగర్ సీటు రావుకు, ఇతరులకు ఇస్తే కరీంనగర్ సీటు రెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా వెలిచాల నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
ఇది ఇలా ఉంటే అసలు హైదరాబాద్ నుండి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారు అన్న విషయంలో తీవ్ర సందిగ్దత నెలకొంది. అసలు పోటీ చేస్తారా ? చేయరా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ స్థానం నుండి ఎంఐఎం గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.