సీఎం అయిన తర్వాత కూడా జగన్ కు ఫ్యాక్షన్ బుద్ధులు పోలేదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోన్న సంగతి తెలిసిందే.
అమరావతి రాజధానిగా నిర్ణయిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదేనని జగ్గారెడ్డి కితాబివ్వడం చర్చనీయాంవమైంది.
ఇక, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, మూడు రాజధానులపై జగన్ వైఖరిని తప్పుబడుతూ జగ్గారెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపాయి.
ఇక, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కూడా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, జగ్గారెడ్డి వర్సెస్ షర్మిల వెర్బల్ వార్ వరుసగా రెండో రోజు కూడా కొనసాగింది.
తాజాగా షర్మిల విమర్శలను ఖండించిన జగ్గారెడ్డి..మరోసారి ఆమెపై విరుచుకుపడ్డారు.
షర్మిల తన జోలికి రాకుంటే… తాను కూడా ఆమె జోలికి వెళ్లనని జగ్గారెడ్డి అన్నారు.
సీఎం కుర్చీ కోసం జగన్ కుటుంబంలో గొడవ జరుగుతోందని, దానికి తన దగ్గర మంచి పరిష్కారముందని జగ్గారెడ్డి అన్నారు.
ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి ముందే ఏపీని జగన్ 3 రాష్ట్రాలుగా విభజిస్తే సరిపోతుందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
అలా చేస్తే జగన్తో పాటు సీఎం కుర్చీ కోసం ఎదురు చూస్తున్న షర్మిల, విజయసాయిరెడ్డిలు కూడా సీఎం అయిపోవచ్చని ఆయన చమత్కరించారు.
షర్మిల తన కుటుంబ పంచాయితీని ఏపీలోనే పెట్టుకోవాలని ఆయన అన్నారు.
అవసరమైతే మోదీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.
మరి, జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలపై షర్మిల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
జగ్గారెడ్డి చెప్పినట్లుగా…ఆయన జోలికి షర్మిల వెళ్లకుండా ఉంటారా…లేక ప్రతి విమర్శ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.