విన్నంతనే నమ్మలేం. కానీ.. అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిస్తే కానీ నమ్మబుద్ది కాదు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఒక బిచ్చగాడు మరణిస్తే.. ప్రముఖుడు మరణించినప్పుడు ఏ రీతిలో అయితే వేలాది మంది తరలి వస్తారో.. అదే రీతిలో రావటం సాధ్యమవుతుందా? అంటే నో అంటే నో చెబుతారు. కానీ.. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా హువినహడగలిలో జరిగిన ఉదంతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజమా? అని విస్మయానికి గురి కావటమే కాదు.. ఇలా ఎందుకన్న సందేహం తలెత్తుతోంది. బిచ్చగాడి అంతిమ యాత్రకు వేలాదిగా ప్రజలు పోటెత్తిన అరుదైన ఉదంతంలోకి వెళితే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.
మానసిక దివ్యాంగుడైన 45 ఏళ్ల హుచ్చబస్య హువినహడగలిలో నివాసం ఉంటాడు. పట్టణంలోని ఆలయాల్లో.. స్కూళ్ల వద్ద తలదాచుకునే అతడి తల్లి ఆ మధ్య మరణించటంతో ఒంటరివాడయ్యాడు. అందరిని ప్రేమతో అప్పాజీగా పిలుస్తుంటాడు. పట్టణ వీధుల్లో తనకు ఎదురు వచ్చిన వాడిని రూపాయి అడిగేవాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చినా తీసుకోడు కదా.. నిరాకరిస్తాడు. అతనికి రూపాయి ఇస్తే తమకు మంచి జరుగుతుందని ప్రజలు నమ్మేవారు.
దీనికి తగ్గట్లే.. అతడికి రూపాయి ఇచ్చిన వారికి మంచి జరగటం.. ఏదో మేలు జరగటం.. కలిసి రావటంతో అతన్ని అందరూ లక్కీ బస్య అని పిలిచేవారు. మానసిక దివ్యాంగుడైనప్పటికీ ఎవరినీ ఇబ్బంది పెట్టని తత్త్వం అతని సొంతం. ఎవరైనా.. ఎంతటి వారినైనా సరే.. పేరు పెట్టి పిలవటం.. ఒక్క రూపాయి మాత్రమే అడగటం ఇతనికి అలవాటు. అందుకు తగ్గట్లే.. ఇతడు రూపాయి అడగటమే లక్కీగా భావించేటోళ్లు వేలాది మంది ఉంటారు. తాజా ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యే వరకు ఎవరినైనా సరే ఆయన పేరు పెట్టి పిలుస్తుంటాడు.
అలాంటి అతడు.. తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రిలోనే మరణించాడు. ఇతడి మరణవార్త విని ఊరంతా వేదన చెందింది. అతడి అంతిమయాత్ర తాజాగా జరిగింది. ఊళ్లోని వారంతా కలిసి చందాలు పోగేసి అంతిమ యాత్రను నిర్వహించారు. అతడి అంతిమయాత్రకు వేలాది మంది హాజరయ్యాడు. హువినహడగలి పట్టణంలో హుచ్చబస్య అంటే తెలియని వారే ఉండరు. అతడి మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రముఖులు పలువురు ఫ్లెక్సీలు పెట్టటం గమనార్హం. ఈ ఉదంతం ఇతర ప్రాంతాల్లోని వారిలో విపరీతమైన ఆసక్తిని పెంచి.. హాట్ టాపిక్ గా మారింది.