వైసీపీ హయాంలో ప్రభుత్వం అండ చూసుకొని కొడాలి నాని మొదలు రోజా వరకు అందరూ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఆ నోళ్లు మూతబడ్డాయి. అంతేకాదు, కేసుల భయంతో చాలామంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నాయకులు భయపడుతున్నారని, ఒకరికి గుండెపోటు వచ్చిందని పరోక్షంగా కొడాలి నానిపై సెటైర్లు వేశారు.
మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరగ్గొట్టుకున్నారని చురకలంటించారు. రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, అయితే చట్టాలు ఉల్లంఘించిన వారికి మాత్రమే రెడ్ బుక్ వర్తిస్తుందని లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత భూ పట్టా అందించిన లోకేశ్…గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసిందని ఆరోపించారు. తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళ్లు కట్టలేదని, తప్పుడు కేసులు బనాయించ లేదని గత జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వంపై దుష్ర్పచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే కొందరు నేతలను రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని చెప్పానని అన్నారు. సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలువైపే ఉంటాయని, తప్పుచేశారు కాబట్టి జగన్ ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంటే ఎక్కువ సెక్యూరిటీ జగన్ కు కల్పించామన్నారు. కనీసం ప్రతిపక్షంలోకి వెళ్ళిన తరువాత కూడా కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదని, ఇక ప్రజలను కలిసే ఓపిక ఆయనకు ఎక్కడుందని ప్రశ్నించారు.