2019 ఎన్నికలలో రాజకీయ వ్యూహకర్త పీకే సాయంతో ఏపీలో 151 స్థానాల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. 90-100 స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా భావించినా..అనూహ్యంగా మరో 50 సీట్లు అదనంగా రావడంతో జగన్ అండ్ కో స్పీడుకు బ్రేకులు లేకుండా పోయాయి. తమకు 151 మంది…ఎమ్మెల్యేలున్నారన్న బలాన్ని ప్రతిపక్ష నేతలను విమర్శించడానికి వాడుకున్నారు. ఆ బలంతోనే మొన్న మొన్నటివరకు వైఎస్ జగన్ తమ పార్టీకి, తనకూ ఎదురే లేదని ధీమాగా ఉన్నారు.
2024 ఎన్నికల్లో..ఆ మాటకొస్తే ఎన్నికలు ఎప్పుడు వస్తే అపుడు గెలుపు తమదేనని జగన్ ఫిక్సయ్యారు. ఇటువంటి సమయంలో జగన్ కు ఆయన పొలిటికల్ స్ట్రేటజిస్ట్ పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ షాకిచ్చారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ అండ్ కోకు జనం మరో చాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని పీకే సర్వేలో వెల్లడైందని లీకులొచ్చాయి. మరోసారి ఏపీలో అధికారం దక్కడం కష్టమని పీకే చెప్పడంతో జగన్ డైలమాలో పడ్డారట.
తనకు బాగా గురి ఉన్న పీకే టీం సర్వే చేయడంతో జగన్ ఆలోచనలో పడ్డారట. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 100 స్థానాల్లో ఫ్యాన్ తిరిగే అవకాశం లేదని పీకే అంచనా వేస్తుండడంతో జగన్ అయోమయంలో పడ్డారట. ఇదంతా పాత కథ. ఎందుకైనా మంచిదని జగన్ పీకే సర్వేతోపాటు తన సొంత సర్వే కూడా ఒకటి చేయించారట. అందులోకూడా పీకే సర్వేకు కొంచెం అటుఇటుగా ఫలితాలు రావడంతో జగన్ కు ఎటూ పాలుపోవడం లేదట.
ఏతా వాతా ఏ సర్వే చూసినా…జగన్ కు మరోసారి సీఎం అయ్యే యోగం అేదని తేలడంతో వైసీపీ నేతలు కూడా డీలా పడుతున్నారట. ఈ సర్వే రిజల్ట్స్ చూసి మానసికంగా వైసీపీ నేతలు కుదేలయ్యారట. ఆ రెండు సర్వేలు చూసిన తర్వాతే జగన్ గడప గడపకు ప్రోగ్రామ్ పేరుతో జనంలోకి ఎమ్మెల్యేలను తోలారట. అయితే, అక్కడ వారిపై వ్యతిరేకత రావడంతో…తప్పు తనమీద ఉంచుకోకుండా పనిచేయని వారికి టికెట్లు ఇవ్వనంటూ కరాఖండిగా చెప్పేశారట జగన్. దీంతో, ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలున్నారట.