ఆ తమ్ముళ్లకు అన్నీ ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నారు. కేడర్ పరంగాను బాగానే కార్యకర్తలురియాక్ట్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపును రాసిపెట్టుకునేందుకు కూడా వీలుంది. అయితే.. ఇప్పుడు లేందల్లా.. ఆ తమ్ముళ్లు తమ అలసత్వాన్ని పక్కన పెట్టే లక్షణమే అంటున్నారు పరిశీలకులు. “ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఇప్పుడే ఎందుకు ? “ అని చాలా మంది తమ్ముళ్లు భావిస్తున్నారు.
ఇది పైకి చెప్పుకునేందుకు బాగానేఉంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ దూకుడు ముందు కార్యకర్తలు నిలవలేక పోతున్నారు. తాజాగా తంబళ్లపల్లి, పీలేరు, పలమనేరు వంటి కీలక నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు తమ ఖాతాలో వేసేసుకున్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారే పరిస్థితిని తీసుకువస్తోంది. అయినప్పటికీ.. నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు.
ఇక మరికొంత మంది.. అంతా బాబు చూసుకుంటారులే! అని నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. “ఇప్పుడు తొందర లేదు. అంతా చంద్రబాబుగారు చూసుకుంటున్నారు. మేం వచ్చి ఏం చేస్తాం. రెండు కేసులు.. నాలుగు లాఠీ దెబ్బలు తప్ప.. మా కార్యకర్తలకు ఒరిగేది లేదు. ఇప్పుడు ఎందుకబ్బా రిస్క్“ అని విజయవాడకు చెందిన ఒక కీలక నేత వ్యాఖ్యానించారు.
మరోవైపు.. కొందరు ఖర్చుకు కూడా వెనుకాడుతున్నారు. ఏ కార్యక్రమం కూడా ఊరికేనే చేయలేమని చెబుతున్నారు. ప్రజల మధ్యకు వెళ్తే.. వారికి ఏదో ఒక రూపంలో ఆదుకోవాలి. లేకపోతే.. ఉత్తచేతులతో వస్తున్నారని.. మాపై అభాండాలు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఎన్నికల ముందు చూసుకుందాంలే! అని చాలా మంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ సంగతి!!