బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ చాన్నాళ్లుగా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక… ఈ వార్తలు మరింతగా పెరిగిపోయాయి. ఇటీవలే రెండు పర్యాయాలు గుడిలో జరిగిన ఏసీబీ తనిఖీలు ఈ వార్తలు నిజమేనని తేల్చేశాయి.
తాజాగా దుర్గ గుడి కార్యనిర్వాహణాధికారి(ఈవో)గా ఉన్న సురేశ్ బాబును బదిలీ చేస్తూ జారీ అయిన ఉత్తర్వుల ద్వారా జగన్ సర్కారు కూడా గుడిలో అక్రమాల దందా నిజమేనని ఒప్పుకున్నట్టైంది. అయితే గుడిలో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం… కేవలం ఈవోను బదిలీతోనే సరిపెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పదవీ బాధ్యతలు చేపట్టాక… అప్పటిదాకా గుడి ఈవోగా కొనసాగుతున్న సూర్యకుమారిని తప్పించి ఆమె స్థానంలో సురేశ్ బాబును నియమించారు. ఈ నియామకంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
మంత్రి వెలంపల్లి ఏరికోరి మరీ సురేశ్ బాబును గుడి ఈఓగా తీసుకువచ్చారని, తన హవాకు ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదన్న భావనతోనే మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నారని వైరి వర్గాలు ఆరోపించాయి. అయితే ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని జగన్ సర్కారు… మంత్రి వాదనకే తలొగ్గి సురేశ్ కుమార్ ను దుర్గ గుడి ఈఓగా నియమించేసింది.
ఎప్పుడైతే సురేశ్ కుమార్ దుర్గ గుడి ఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారో… అప్పటి నుంచే గుడిలో పెద్ద ఎత్తున అక్రమాలకు తెర లేసిందని విపక్షాలన్నీ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇటు మంత్రి వెలంపల్లి గానీ, అటు జగన్ సర్కారు గానీ ఈ ఆరోపణలను అంతగా పట్టించుకోలేదు. దీంతో ఈఓ మరింతగా చెలరేగిపోయినట్టుగా తెలుస్తోంది.
అంతేకాకుండా మంత్రి వెలంపల్లి అండతోనే ఈఓ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు మరింతగా పెరిగిపోవడంతో ఏసీబీ గుడిలో అక్రమాలపై దృష్టి సారించింది. రెండు విడతలుగా సోదాలు చేసిన ఏసీబీ… గుడిలో అక్రమాల మాట నిజమేనని తేల్చింది.
ఈ అక్రమాలకు ఈఓనే పూర్తి బాధ్యుడిగా కూడా గుర్తించినట్లు సమాచారం. అయితే ఈఓపై చర్యలు తీసుకుంటే… మంత్రి వెలంపల్లి బుక్ అవుతారన్న భావనతో కేవలం సురేశ్ కుమార్ ను కేవలం బదిలీ చేసేసి… గుడిలో అక్రమాల దందాకు ఫుల్ స్టాప్ పెట్టేలా వైసీపీ సర్కారు వ్యూహం పన్నిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి
దుర్గగుడి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు.
దుర్గ గుడి నూతన ఈఓగా భ్రమరాంబ నియామకం.
తక్షణమే బదిలీ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్న ప్రభుత్వం. pic.twitter.com/IpZxEX9QyJ
— Meghana..✨ (@MeghanaYSRCP) April 7, 2021