బీజేపీ ఎంపీ.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ ఎస్ పార్టీ ఇక కనుమరుగై పోతుందని.. బీజేపీనే ఉంటుందని వ్యాఖ్యానించారు. “కేసీఆర్ శకం ముగిసింది. బీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలు“ అని అన్నారు ‘‘ఏడాది క్రితం వరకు తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా డెవలప్ అయి అధికారంలోకి వచ్చింది“ అని తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయన్న అర్వింద్.. హుందాతనమైన భాష ఇప్పుడు వస్తుం దన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా భాష ఉండదని.. దాడుల సంస్కృతి ఉండదని భావిస్తున్నామన్నా రు. నీచమైన రాజకీయాలకు స్వస్తి పలుకుతూ స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయన్న అంశంపై పార్టీలో లోతైన చర్చ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది కాబట్టే ఈ ఫలితాలు ఇలా వచ్చి ఉంటాయన్నారు. లిక్కర్ కేసులో కవితను జైలుకు పంపకపోవడం కూడా ఒక కారణమేనన్నారు. దీనిపైన పార్టీలో చర్చ అవసరమని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను. నా పార్లమెంటు పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. కోరుట్ల ప్రజలందరికీ ధన్యవాదాలు“ అని అర్వింద్ చెప్పారు.