ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంపు హామీని అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గానికి చెందిన వారు రూ.4 వేల పెన్షన్ అందుకుంటున్నారు. అలాగే దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తున్నారు. అయితే తాజాగా కూటమి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందేవారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తాజాగా విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ అందించాలని.. అదే సమయంలో బోగస్ కార్డుల్ని ఏరిపారేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇటీవల సామాజిక తనిఖీలు చేస్తుండగా కొంతమంది చెవుడు ఉన్నట్లు దొంగ సర్టిఫికెట్లు పొంది దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే బోగస్ సర్టిఫికేట్లతో పింఛన్ల తీసుకునేవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని.. వారికి వెంటనే పెన్షన్ కట్ చేయాలని మంత్రి డోలా సూచన చేశారు. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేసి.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని.. ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి డోలా సూచించారు.