ఏపీలో కొద్ది రోజులుగా సినిమా టికెట్ల వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసి జీవో 35ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టి వేసింది. అయితే, ఆ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే పిటిషన్ వేసిన 230 థియేటర్లు తప్ప మిగతా థియేటర్ల వారు రేట్లు పెంచుకోవడానికి వీల్లేదంటూ ఏపీ సర్కార్ చెబుతోంది.
అయితే, ప్రభుత్వం చెప్పినట్లు రేట్లు తగ్గించి అమ్మితే తాము థియేటర్లు మూసుకోవాల్సిందేనని యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహించి టికెట్ ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నిన్న విజయవాడలో థియేటర్లు తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు, పోలీసులు నిబంధలను పాటించని థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. మరికొన్ని చోట్లు థియేటర్లు సీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో 50 థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. తక్కువ రేట్లకు థియేటర్లు నడపలేమని, ప్రభుత్వం నిబంధనల పేరుతో తనిఖీలు చేయడంతో థియేటర్లు మూసివేశామని చెబుతున్నారు. ఈ 50 థియేటర్లే కాదు…ఇంకా రాష్ట్రంలోని పలు థియేటర్ల యజమానులు కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నారట.
గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడంపై పలువురు థియేటర్ల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.