ఆరు నెలలకు పైగా సాగిన నిరీక్షణకు ఇటీవలే తెరదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. దీంతో ఆ రంగాన్ని నమ్ముకున్న వారికి ప్రాణం లేచి వచ్చింది. కాకపోతే 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్లు నడపాలని, కరోనా నియంత్రణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఐతే ఈ నియంత్రణలు పాటిస్తూ సినిమాలు నడిపితే ఏమాత్రం రెవెన్యూ వస్తుంది.. ఏం లాభాలు వస్తాయి అనే సందేహాలు ఎగ్జిబిటర్లలో వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ థియేటర్ల సంఘం కీలక సమావేశాన్ని నిర్వహించింది. థియేటర్లు పున:ప్రారంభించేందుకు అనుమతులివ్వడాన్ని స్వాగతించిన ఈ సంఘం.. ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తూనే థియేటర్లు నడుపుకోవడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించింది.
తీవ్రంగా నష్టపోయిన తమ పట్ల ప్రభుత్వం కొంచెం కనికరం చూపాలని ఈ సంఘం విజ్ఞప్తి చేసింది. లాక్ డౌన్ టైంలో థియేటర్లకు విధించిన కరెంటు బిల్లులను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు థియేటర్ల యజమానులు. అలాగే థియేటర్లలో మళ్లీ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి అనుమతులివ్వాలని కోరారు. ఈ సమయంలో దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్యమే అని.. కొంత మేర నష్టాలు పూడుతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఐతే థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లే. ఈ పరిస్థితుల్లో మళ్లీ పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తే వారిలో అసంతృప్తి రగలడం ఖాయం. అది ప్రభుత్వం మీద కోపంగా మారొచ్చు. కాబట్టి ఇందుకు అనుమతులివ్వడం సందేహమే.
కాగా లాక్ డౌన్ టైంలో థియేటర్లు నడవలేదు కాబట్టి కనీస స్థాయిలోనే విద్యులు బిల్లులు వచ్చి ఉంటాయి. వాటిని రద్దు చేస్తే థియేటర్ల మీద కొంచెం భారం తగ్గినట్లవుతుంది. మరి ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.