మొత్తానికి ఆరు నెలలకు పైగా సాగుతున్న నిరీక్షణ ఫలించింది. సరిగ్గా ఏడు నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. మార్చి రెండో వారంలో మూత పడ్డ థియేటర్లు కొన్ని రోజుల్లోనే మళ్లీ తెరుచుకుంటాయని సినీ ప్రియులు అనుకున్నారు. కానీ రోజులు కాస్తా నెలలయ్యాయి. వచ్చే నెల వచ్చే నెల అనుకుంటూనే ఆరున్నర నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు నిరీక్షణకు తెరదించుతూ అక్టోబరు 15 నుంచి థియేటర్లు పున:ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇందుకు అడ్డు చెప్పకపోవచ్చు. ఈ నెల మధ్య నుంచి థియేటర్లు తెరుచుకోవడం లాంఛనమే. కాకపోతే అనుకున్నట్లుగానే థియేటర్లలో యాభై శాతం సీట్లనే నింపాలి. సగం ఖాళీ వదిలేయాలి. కరోనా నివారణ చర్యల్ని కట్టుదిట్టంగా పాటించాలి.
ఈ మార్గదర్శకాల్ని బట్టి చూస్తే థియేటర్ ఫుల్ అయినా సరే.. వచ్చే రెవెన్యూ సగమే. పైగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి వాటి వల్ల ఖర్చు పెరుగుతుంది. దీనికి తోడు ప్రేక్షకులు వెంటనే థియేటర్లకు రాకపోవచ్చు. వాళ్లలో కదలిక రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆరంభంలో కొన్ని వారాల పాటు ఆదాయం గురించి ఏమీ ఆశించడానికి వీల్లేదు.
ఇలాంటి సంక్లిష్ట స్థితిలో కొత్త సినిమాలు విడుదల కావడమూ కష్టమే. ట్రయల్ కోసం నామమాత్రంగా కొన్ని సినిమాలు వదిలి చూస్తారేమో నిర్మాతలు. అంతే తప్ప పేరున్న సినిమాలేవీ విడుదల కాకపోవచ్చు. ఇక థియేటర్ల యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయి సిబ్బందితో థియేటర్లను నడిపించకపోవచ్చు.
మల్టీప్లెక్సులు అన్ని స్క్రీన్లనూ తెరవకపోవచ్చు. ఇటు ప్రొడ్యూసర్లు, అటు ప్రేక్షకులు.. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలు కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు వేచి చూసే ధోరణినే పాటిస్తాయనడంలో సందేహం లేదు.
ట్రయల్ పీరియడ్ లాగా కొన్ని వారాలు థియేటర్లలో ఏవో కొన్ని సినిమాలు నడిచాక అందరిలోనూ ధైర్యం వచ్చాక, ప్రభుత్వం పూర్తి స్థాయి సీట్ల భర్తీకి అనుమతులు ఇచ్చాక కానీ థియేటర్లు ఒకప్పటిలా నడవవు. పేరున్న కొత్త సినిమాలు విడుదల కావు.