ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గతంలో పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఓ దశలో చిరంజీవి కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరతారని టాక్ కూడా వచ్చింది. వైసీపీ తరఫున చిరును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయినా సరే, సినీ ఇండస్ట్రీలో సమస్యలు చర్చించేందుకు, టికెట్ల ధరల పెంపు..ఇలా పలు కారణాలతో జగన్, చిరులు కొన్నిసార్లు భేటీ అయ్యారు.
టాలీవుడ్ , థియేటర్లకు సంబంధించిన పలు సమస్యలను చర్చించేందుకు చిరును తనతో భేటీ కావాల్సిందిగా జగన్ పేర్ని నానితో పురమాయించిన సంగతి తెలిసిందే. ఇక, ఆదివారం జరిగిన లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ ఇండస్ట్రీని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఏ విపత్తు వచ్చినా ముందుగా సినిమా ఇండస్ట్రీ స్పందిస్తుందని, ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ సంక్షోభంలో పడిపోయిందని అన్నారు. ఈ క్రమంలోనే మంత్రి పేర్ని నానితో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు.
ఈ భేటీ నేపథ్యంలో చిరు, జగన్ ల గురించి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవంటే సీఎం జగన్ కు ఇష్టమని, చిరుతో జగన్ సోదర భావంతో ఉంటారని నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. చిరు విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని నాని అన్నారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై నిర్మాతలు, థియేటర్ల యజమానులతో చర్చించాన్నారు.
ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే విధానానికి సినీ పెద్దలంతా సుముఖంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపారని నాని వెల్లడించారు. ఈ సమావేశంలోని విషయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తదుపరి చర్యలు తీసుకుంటామని నాని తెలిపారు.