వేలాదిమంది కశ్మీరీ పండితుల్ని ఊచకోత కోసిన దుర్మార్గాన్ని ఘనత వహించిన మీడియా కానీ.. మేధావులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ మరుగున పడేసే ప్రయత్నం చేశారే కానీ.. బట్టబయలు చేసింది లేదు. ఆ కొరతను తీర్చింది వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్. సైలెంట్ గా రిలీజ్ .. అనూహ్య విజయాన్ని సాధించటమే కాదు.. రోజుల తరబడి థియేటర్లలో ఆడిన ఈ మూవీ తర్వాత.. మే మొదటి వారంలో విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్ ఇప్పుడు పెను సంచనలంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇతర మతాలకు చెందిన అమ్మాయిల్నిబ్రెయిన్ వాష్ చేసి.. మత మార్పిడికి ప్రేరేపించి ఇస్లామిక్ టెర్రర్ మిషన్లలోకి ప్రవేశించిన సుమారు 32 వేలమంది మహిళలకు సంబంధించిన వాస్తవ ఉదంతాలతో నిర్మించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన రోజు వ్యవధిలోనే భారీగా వైరల్ కావటమే కాదు పెద్ద ఎత్తున షేర్ అవుతోంది.
రోజు వ్యవధిలోనే 6.6 మిలియన్ వ్యూస్ తో టాప్ త్రీలో నిలిచిన ఈ ట్రైలర్ కింద 65వేలకు పైగా మెసేజ్ లు పోస్టు చేశారు. ఇందులో అత్యధికులు మూవీ టీం ధైర్యాన్ని మెచ్చుకోవటమే కాదు.. ఇలాంటి వాస్తవ అంశాలతో నిర్మించిన సినిమాలు మరిన్ని రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటం కనిపిస్తోంది. కేరళకు చెందిన పలువురు స్పందిస్తూ.. ఇది సినిమా కాదని.. నిజ జీవితంలో జరిగే అంశాలుగా పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ బయటకు వస్తున్న వేళలో.. సూడ్ లౌకిక వాదులు.. కమ్యునిస్టులతోపాటు ప్రజాస్వామ్య వాదులుగా నీతులు వల్లించే వారికి ఈ మూవీ ట్రైలర్ ఏ మాత్రం మింగుడుపడటం లేదంటున్నారు.
కశ్మీర్ ఫైల్స్ మూవీ విడుదలైనప్పడు ఏ రీతిలో అయితే.. దానిపై కొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చి.. అడ్డంగా ఫెయిల్ అయ్యారో.. ఇప్పుడీ మూవీ విడుదల నాటికి కొన్ని వాదనలతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఏమైనా.. ‘ది కేరళ స్టోరీ’ సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పక తప్పదు. ట్రైలర్ రిలీజ్ తోనే పెను సంచలనంగా మారిన నేపథ్యంలో.. సినిమా విడుదలయ్యే మే మొదటి వారం నుంచి మరింత భారీ చర్చకు తెర తీయటం ఖాయమంటున్నారు.