‘ది కశ్మీర్ ఫైల్స్’..దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమానే హాట్ టాపిక్ గా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు…సినీ ప్రియులు మొదలు సినీ క్రిటిక్స్ వరకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా…డార్క్ హార్స్ లా కలెక్షన్ల రేసులో దూసుకుపోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ సినిమాపై పలవురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.
రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం…ప్రస్తుతం రూ. 50 కోట్లు కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయించాయి. అస్సాం ప్రభుత్వం అయితే ఏకంగా ఈ సినిమా చూసేందుకు తమ ఉద్యోగులకు హాఫ్ డే హాలిడే ప్రకటించింది. కేవలం మౌత్ టాక్ తోనే కంటెంట్ బలంగా ఉన్న ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుంది.
దీంతో, థియేటర్లకు వెళ్లలేని వారంతా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5…ఏప్రిల్ 2వ వారంలో ఈ సినిమాను స్ట్రీమ్ చేయాలని అనుకున్నారు. కానీ, ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడంతో మరికొద్ది రోజులు థియేటర్లలో సినిమా ప్రదర్శించాలని అనుకుంటున్నారట. దీంతో, మే 6 నుంచి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుబెట్టబోతున్నారని తెలుస్తోంది. కానీ, ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
1980-90లలో కశ్మీర్లో కశ్మీర్ పండిట్ల ఊచకోత, వారిపై జరిగిన అఘాయిత్యాలు, మారణహోమం, వారు కశ్మీర్ విడిచి వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం అద్దం పట్టింది. నాలుగేళ్ల పాటు పరిశోధన చేసి వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చెప్పారు. అంతేకాదు, ఇంకా వెలుగులోకి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ క్రోఢీకరించి వెబ్ సిరీస్ రూపొందించే యోచనలో ఉన్నానని వెల్లడించారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి లెజెండరీ నటులతోపాటు పల్లవి జోషి, దర్శన్ కుమార్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాదే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ చిత్రం కలెక్షన్లు, ప్రభాస్ బాలీవుడ్ కెరీర్ పై కూడా ఈ చిన్న సినిమా ప్రభావం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.