ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి.. మునుపెన్నడూ లేని స్థాయిలో భారతీయుల దృష్టి ఈ వేడుక మీద నిలిచింది. హాలీవుడ్లో మహామహులై ఫిలి సెలబ్రెటీలను అబ్బురపడేలా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈసారి అకాడమీ అవార్డుల్లో కచ్చితంగా సత్తా చాటుతుందన్న అంచనాలు కలిగాయి.
మిగతా విభాగాల్లో నామినేషన్ సంపాదించకపోయినా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ అవార్డు తుది జాబితాలోకి ఎంపికైంది.. ఇప్పుడు అంచనాలకు తగ్గట్లే ఈ పాట అవార్డు కూడా సాధించింది. దీంతో ఇండియా అంతా దీని గురించే హోరెత్తిపోతోంది ఉదయం నుంచి.
ఐతే ఈ హడావుడిలో ‘బెస్ట్ డ్యాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం’ విభాగంలో ‘ది ఎలిఫాంట్ విస్పరర్స్’ అనే భారతీయ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు గెలిచిన విషయం మరుగున పడిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుంచి వచ్చిన డాక్యుమెంటరీలను వెనక్కి నెట్టి ఇది అవార్డును గెలవడం చిన్న విషయం కాదు.
ఇది ఇండియాతో పాటు అమెరికా భాగస్వామ్యంతో తెరకెక్కిన డాక్యుమెంటరీ. నెట్ ఫ్లిక్స్ వాళ్ల అండతో ఈ డాక్యుమెంటరీని కార్తీక్ గొనాసాల్వ్స్ రూపొందించాడు. కనిపించిన నటీనటులు.. పని చేసిన సాంకేతిక నిపుణులు అందరూ మన వాళ్లే.
39 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీలో ఏనుగుల మూగ సైగలను అర్థం చేసుకుని వాటితో కలిసి సాగే మావటుల గురించి చూపించారు. పర్యావరణ పరిరక్షణ.. మూగజీవాల సంరక్షణ.. ప్రకృతితో మమేకం.. జంతు ప్రేమ తదితర విషయాల గురించి గొప్పగా వివరించి.. ఆలోచింపజేసేలా చూపించారు. చాలా హృద్యంగా సాగే ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరి దృష్టి దానిపై పడింది. ఇది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.