ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మూలం ఏమిటి? దీనిపై పరిశోధనలు చేస్తుంటే లీకైందా? లేదంటే.. జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా మార్చి వదిలారా? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉన్నా.. సమాధానాలు మాత్రం తక్కువే. తాజాగా చైనాకు చెందిన మిలటరీ సైంటిస్టులకు చెందినట్లుగా చెప్పే రీసెర్చ్ పత్రం ఒకటి లీకైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ లీకైన సమాచారంతో ది ఆస్ట్రేలియన్ పత్రిక ఒకటి కథనాన్ని పబ్లిష్ చేసింది. అందులో పలు అంశాలు ఉన్నాయి. చైనాకు చెందిన ఒక రహస్య పత్రాన్ని అమెరికన్ అధికారులకు దొరికిందని.. అందులో పలు కీలక అంశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
మనుషులు సృష్టించిన సార్స్.. ఇతర కొత్త వైరస్ లను జన్యుమార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించే అంశానికి సంబంధించి చైనా మిలటరీ సైంటిస్టులు.. ఉన్నతాధికారులు రాసిన పత్రంగా దీన్ని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆస్ట్రేలియన్ పత్రిక.. వూహాన్ లో ఏం జరిగిందన్న దానిపై ఒక నివేదికను విడుదల చేసింది.
అందులో పేర్కొన్న దాని ప్రకారం.. సరికొత్త జెనటిక్ ఆయుధాల్లో సార్స్ కరోనా వైరస్ లు ఒక భాగమని.. మనుషులకు వ్యాధులు కలిగించే వైరస్ లుగా.. వాటిలో కృత్రిమంగా మార్పులు చేయొచ్చని.. తర్వాత బయో ఆయుధాలుగా మార్చి ప్రయోగించొచ్చని పేర్కొంది. చైనాకు చెందిన ఈ రహస్య పత్రాల్ని సిద్ధం చేసిన వారిలో 18 మంది ఆ దేశ ఆర్మీ శాస్త్రవేత్తలు.. ఆయుధ నిపుణులు.. ఇతర ఉన్నతాధికారుల పేర్లు ఉండటం గమనార్హం.
2003లో చైనాతో పాటు మరికొన్ని దేశాల్ని వణికించిన సారర్స్ వైరస్ కచ్ఛితంగా మనుషులు తయారు చేసిన జీవాయుధమే అయి ఉంటుందని సదరు రహస్య పత్రం స్పష్టం చేసింది. ఉగ్రవాదులు దానిని ఉద్దేశపూర్వకంగా ప్రయోగించి ఉంటారని అంచనా వేస్తున్నారు. సార్స్ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకేజ్ అయి ఉంటుందన్న అంశాన్ని కొట్టి పారేయలేదు సరికదా.. ఆ కోణంలో మరింత పరిశోధన జరగాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.