అల్లు రామలింగయ్య… అలనాటి మహానటుడు. ప్రేక్షకులకు ఎంతో వినోదం పంచిన అల్లు రామలింగయ్య సినీ వారసత్వం ఇపుడు రెండు కుటుంబాలుగా వృద్ధి చెందింది. తెలుగు సినిమాను డామినేట్ చేసే స్థాయిలో అటు మెగా ఫ్యామిలీ, ఇటు అల్లు ఫ్యామిలీగా ఎదిగింది. ఇపుడు రెండు కుటుంబాలు… బంధువులుగా సఖ్యంగా ఉంటూనే వ్యాపార పరంగా మాత్రం ఎవరి సత్తా వారు చాటుతున్నారు. వ్యాపారపరంగా వేర్వేరుగా ఎదగడం కూడా మొదలైంది. నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతిని పురస్కరించుకుని అల్లు కుటుంబం ఆయన పేరు మీద స్టూడియో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ రోజు నుంచి ప్రారంభమై శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఏడాదిలోపు దీనిని ఒక షేపుకి తెచ్చి… అల్లు రామలింగయ్య శత జయంతికి గ్రాండ్ ఓపెనింగ్ చేయాలని అల్లు కుటుంబం పట్టుదలతో ఉంది. ఇది సడెన్ నిర్ణయం కాదు గాని జనాలకు మాత్రం సడెన్ గా తెలిసింది. ఈ స్మార్ట్ సంచలన నిర్ణయంతో అల్లు కుటుంబం మరో ఎత్తుకు ఎదిగినట్లే.
అల్లు అరవింద్ తన చాణక్యంతో ఇండస్ట్రీలో తనకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. నిర్మాణ సంస్థగా పెద్ద చిన్న సినిమాలతో పాటు థియేటర్లను పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తున్నారు. థియేటర్లకు కాలం చెల్లే అవకాశం ఉందన్న నేపథ్యంలో చాలా తెలివిగా ముందే ఓటీటీ వైపు అడుగులు వేశారు. ఆయన ప్రారంభించిన ఆహా ఓటీటీ విజయవంతంగా నడుస్తోంది.
నిజానికి ఈ ఓటీటీ వెంచర్ ముందుగా రామోజీ గ్రూపు నుంచి వస్తుందేమో అనుకున్నారు గానీ అల్లు కాస్త అడ్వాన్స్ డ్ గా ఆలోచించారనే చెప్పాలి. అయితే, అల్లు అరవింద్ గాని… అతని ఇద్దరు కుమారులు గాని స్మార్ట్ పెట్టుబడిదారులే. అందుకే కాస్త ముందే మంచి ఆలోచన చేశారు.