నిత్యం.. ఉప్పు-నిప్పుగా ఉండే.. వైసీపీ-టీడీపీ నేతల విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సీఎం జగన్ వ్యవహార శైలిపై నిప్పులు చెరుగుతూ.. ఆయన పాలన, సంక్షేమపథకాల్లోని తప్పులను ఎత్తి చూపుతూ.. టీడీపీ నేతలు దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రధానంగా అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ ఇద్దరూకూడా సీఎం జగన్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రాజకీయంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర వివాదాలు, విభేదాలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ…. అధికార పక్షం వైసీపీ తప్పులను ఎప్పటికపుడు బయటపెట్టి నిలదీస్తోంది.
ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌కు థ్యాంక్స్ చెప్పారు. “థ్యాంక్యూ జగన్ సార్“ అని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామంటూ.. జగన్ సర్కారు మొండిగా ముందుకు సాగింది.
అయితే.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వాటిని వాయిదా వేయాలని లోకేష్ లేఖ రాశారు. లోకేష్ అడిగారు కాబట్టి వినకూడదు అని ముందు మొండిగా వ్యవహరించినా.. ఎట్టకేలకు జగన్ సర్కారు దిగి వచ్చి.. పరీక్షలను వాయిదా వేసింది.
లేకపోయిఉంటే.. ఈ రోజు(బుధవారం) నుంచి పరీక్షలు జరగాల్సి ఉండేది. ఈ క్రమంలోనే తమ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జగన్ తీసుకున్న పరీక్షల వాయిదా నిర్ణయాన్ని లోకేష్ తాజాగా స్వాగతించారు. ఈ క్రమంలోనే ఆయన థ్యాంక్యూ సీఎం సార్.. అని వ్యాఖ్యానించారు.
ఇక, అదేసమయంలో వచ్చే జూన్‌లో నిర్వహిస్తామని చెబుతున్న పదోతరగతి పరీక్షలను కూడా వాయిదా వేయాలని.. మరింత కఠినంగా రాష్ట్రంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలని కోరారు.
ఆసుపత్రుల్లో బెడ్లను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రికి సూచించారు. మొత్తానికి లోకేష్ నోటి నుంచి ఇప్పటి వరకు వినని జగన్ సార్ థ్యాంక్యు అనే కామెంట్ రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం గమనార్హం.