టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడో రోజు సందర్భంగా పలమనేరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి పెద్దిరెడ్డి సొంత ఇలాకా అయిన పలమనేరులో పాదయాత్ర సాగుతున్న సందర్భంగా లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు, లోకేష్ ప్రచార రథాన్ని కూడా సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అనుమతులు లేకుండా వాహనాన్ని తీసుకువచ్చారని పోలీసులు ఆరోపించారు.
ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే పలమనేరులో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు చివరకు చేసేదేమీ లేక ప్రచార రథాన్ని వదిలేసి లోకేష్ పాదయాత్రకు అడ్డు తప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలమనేరు క్లాక్ టవర్ సెంటర్లో ప్రసంగించిన లోకేష్… జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని, జగన్ పతనం నెల్లూరు నుంచి ప్రారంభమైందని లోకేష్ అన్నారు. 151 సీట్లతో జగన్ కు అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పట్టు రైతులకు 19 ఏళ్లుగా ఇస్తున్న సబ్సిడీని జగన్ రద్దు చేశారని లోకేష్ మండిపడ్డారు. డ్రిప్ ఇరిగేషన్ కూడా సైకో జగన్ అటకెక్కించారని ఆరోపించారు. జగన్ హయాంలో కల్తీ లిక్కర్ పురుగుమందు కంటే బాగా పని చేస్తుందని అన్నారు.
మోడీ వస్తే మరోసారి కాళ్లు పట్టుకునేందుకు జగన్ రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సీబీఐ పేరు వింటే జగన్ కాళ్లు వణికిపోతున్నాయని, ప్యాంటు తడిసిపోతుందని లోకేష్ చురకలంటించారు. 25 ఎంపీ సీట్లు వస్తే హోదా తెస్తానని చెప్పిన జగన్.. కేసుల నుంచి బయట పడేందుకే ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు.