రోజా సొంత ఇలాకా నగరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఉద్రిక్తత కొనసాగుతోంది. రోజా ఇంటికి చీర, జాకెట్ తీసుకుని తెలుగు మహిళలు వెళ్లిన ఘటన ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంటి లోపలికి చొరబడి వాటిని రోజాకు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రోజా ఇంటి ముందు టీడీపీ మహిళా నేతలను అడ్డుకొని పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో, వారిని విడుదల చేయాలంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ నేతలు భారీగా చేరుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రోజా ఇంటికి ఎలా వెళ్తారంటూ టీడీపీ నేతలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ కూడా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రోజా ఇంటిపై దాడికి యత్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
స్టేషన్ ఆవరణలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో, టీడీపీ, వైసీపీ నేతలను పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పంపించేస్తున్నారు. ఇరువర్గాలను సముదాయించి బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు. అయినప్పటికీ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నగరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. ఇరు వర్గాల వారు రోడ్డుకి ఇరువైపులా వేచి చూస్తుండడంతో నగరి మొత్తం ఉద్రిక్తంగ మారింది.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైతే అదనపు పోలీసు బలగాలను దించాలని స్థానిక పోలీసులు భావిస్తున్నారు.