టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 250 అన్న క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కేవలం రూ.5కే పేదలకు కడుపునిండా భోజనం పెట్టిన చంద్రబాబు కడుపు చల్లగా ఉండాలని ఆ క్యాంటీన్లో పట్టెడన్నం తిన్న ప్రతి ఒక్కరూ దీవించారు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు ప్రారంభించారన్న ఒకే ఒక్క కారణంతో అన్నా క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా ఆపివేశారు.
వాటిని మూసివేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేశారు జగన్. కానీ, ఎలాగైనా పేదల ఆకలి తీర్చాలని సంకల్పించిన కొంతమంది టీడీపీ నేతలు మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరవాలని చూశారు. కానీ, అటువంటి వారికి ఎన్నో అవరోధాలు, అడ్డంకులు కల్పించింది జగన్ ప్రభుత్వం. అయినా సరే వాటన్నింటిని అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు.
స్థానిక టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రుల చొరవతో చాలా ప్రాంతాల్లో పార్టీ తరపున అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించారు. కానీ, వాటిని కూడా మూసివేయడానికి అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇటీవల, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కొందరు దుండగులు అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుమారం రేపింది.
ఇక, తాజాగా నిన్న అర్ధరాత్రి కుప్పంలో మరోసారి అన్నా క్యాంటీన్ ను కొందరు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు క్యాంటీన్ పై దాడి చేసి తాత్కాలిక షెడ్లను కూల్చి వేయడంతోపాటు అక్కడున్న ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ దాడి చేసింది వైసీపీ కార్యకర్తలేనని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో కుప్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లపై దాడి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని లోకేశ్ విమర్శించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న క్యాంటీన్ పై వైసీపీ రౌడీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు పేద వాడి నోటి దగ్గర కూడును లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నా క్యాంటీన్లను నిర్వహించి తీరుతామన్నారు. అర్ధరాత్రి కుప్పంలో అన్నా క్యాంటీన్ పై దాడి చేసిన వైసీపీ రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Comments 1