సీఎం జగన్ పాలనలో వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సామాన్య ప్రజలు మొదలు సెలబ్రిటీల వరకు…భూమి ఎవరిదైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కన్ను పడిందంటే చాలు కబ్జా కావాల్సిందేనని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వైసీపీ నేతలు బోర్డు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం….భూమి ఏదైనా సరే కబ్జా మాత్రం కామన్.
ఎకరాల కొద్దీ పొలాలు, వందల సెంట్ల కమర్షియల్ ప్లాట్లు స్వాధీనం చేసుకుని భూ బకాసురులుగా మారుతున్నారు. ఇదేం అన్యాయం అని ఎవరైనా ఎదురు తిగిగితే…ఇచ్చిన పదో పరకో తీసుకొని స్థలం రాసిచ్చి ఖాళీచేయాలంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. మాట వినని వారిపై రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ రెండూ కుదరకపోతే రెెవెన్యూ శాఖలో లొసుగులు, అధికారం ఉపయోగించి కొత్త రికార్డులను సృష్టించి అసలు స్థలం ఓనర్లను కోర్టులపాలు చేస్తున్నారు. ఇక, కోట్ల విలువజేసే ప్రభుత్వ భూములను వైసీపీ కార్యాలయాలకు, వైసీపీ నేతలకు కేటాయించడం నిత్యకృత్యమైందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మచిలీపట్నంలో తాజాగా కోట్లాది రూపాయాల విలువచేసే ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన చేపట్టారు. రవీంద్రతోపాటు టీడీపీ నేత కొనకళ్ల బల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో మచిలీపట్నంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వైసీపీ కార్యాలయానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని మీడియాకు చూపించేందుకు కొల్లు రవీంద్ర ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కొల్లు రవీంద్ర, బల్లయ్యలను అరెస్టు చేసి గూడూరు వైపు పోలీసులు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసుల చర్యను, కొల్లు రవీంద్ర అరెస్టును ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది.