తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి.. పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు.. దేశ వ్యాప్తంగా పార్టీ నేతలు హాథ్ సే హాథ్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి కూడా.. పాదయాత్ర ప్రారంభించారు. మేడారం నుంచి రేవంత్ ఈ యాత్రను ప్రారంభించారు. ముం దుగా ములుగు జిల్లాలో రెండు రోజుల పాటు యాత్ర సాగనుండగా.. రెండు నెలలపాటు మహబూబాబాద్ పార్లమెం టు నియోజకవర్గంలోని మిగతా ఏడు నియోజకవర్గంలో జరగనుంది.
లక్ష్యం ఇదే..
రేవంత్ తన పాదయాత్ర ద్వారా.. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పార్టీని పుంజుకు నేలా చేయనున్నారు. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ముఖ్యంగా ఆయన పెట్టుకున్న లక్ష్యం. దీనికి అనుగుణంగానే ఆయన యాత్రను ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన రేవంత్.. ముందుగా ములుగు జిల్లా గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో పూజలు చేశారు.
అక్కడి నుంచి మేడారానికి చేరుకుని వనదేవతలను దర్శించి.. దీవెనలు తీసుకుని యాత్ర మొదలు పెట్టారు. కొత్తూరు, నార్లాపూర్ గోవిందరావుపేట ప్రాజెక్ట్ నగర్ అక్కడినుంచి పస్రా వరకూ వచ్చి అక్కడి కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం.. గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్, వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ మీదుగా పాలంపేట చేరుకుంటారు.
రాత్రికి అక్కడే బస చేసి…రేపు తిరిగి యాత్రను ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు.. ములుగు జిల్లాలోనే రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతుంది. ఇక, ఎప్పటిలాగానే అసంతృప్తులు తమ ధోరణిలో తామే ఉన్నారు. ఎక్కడా కూడా కదలిరాకపోవడం గమనార్హం. ఎవరికి వారు.. తమ తమ పంథాలోనే రాజకీయాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి వీరిని రేవంత్ ఎలా లైన్లో పెడతారో చూడాలి.