రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను, సామాన్యులను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలను వేధించిన తాడిపత్రి డిఎస్పిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నువ్వు ప్రభుత్వానికి తొత్తువి అంటూ జేసీ షాకింగ్ కామెంట్స్ చేయడం అప్పట్లో దుమారం రేపింది. వైసీపీ ప్రభుత్వ పాలన సరిగా లేదని ఆయన ఎన్నోసార్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు.
అకారణంగా టీడీపీ నేతలపై, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించిన జేసీ…గతంలో టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద నిరసన చేపట్టిన జేసీని…పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని జేసీ ఆరోపించారు. అయితే, జేసీని అరెస్టు చేసిన తర్వాత పలుచోట్లకు తిప్పిన పోలీసులు తిరిగి పెద్దపప్పూరుకు తీసుకువచ్చారు. అంతేకాదు, బెయిల్ ఇవ్వడానికి నోటీసుపై సంతకం చేయాలని జేసీని పోలీసులు కోరారు. అయితే, ఇసుక అక్రమ తవ్వకాలపై తన ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలని జేసీ కోరారు. కానీ, జేసీ కోరినట్లు ఫిర్యాదుపై రసీదు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు.
ఈ క్రమంలోనే జేసీ అరెస్టు వార్త తెలుకున్న టీడీపీ శ్రేణులు పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చాయి. జేసీ అరెస్ట్ కు నిరసన తెలుపుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.