వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవటమే కాదు.. హైదరాబాద్ మహానగరానికి టెన్షన్ పెట్టిన బీజేపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం పీడీ యాక్టు కింద నమోదు చేసిన కేసులో చంచలగూడ జైల్లో ఉంటున్న ఆయన విడుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజాసింగ్ సతీమణి ఉషా బాయి గవర్నర్ తమిళ సైతో భేటీ అయ్యారు. తన భర్తపై అక్రమంగా పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లుగా పేర్కొన్నారు.
తన భర్తను అక్రమంగా జైలుకు పంపిన అంశంలో తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె కోరారు. తన సోదరీమణులతో గవర్నర్ తమిళ సైను ఆమె కలిశారు. తన భర్త మీద కక్ష పూరితంగా కేసులు బనాయించారని.. ఆయనపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలుగా ఆమె పేర్కొన్నారు. తన భర్త మీద గతంలో పెట్టిన కేసుల్లో చాలావరకు ప్రజాప్రతినిధుల కోర్టులో కొట్టేశారని.. కొన్ని కేసులు విచారణ చివర్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
కక్ష పూరితంగా తన భర్త మీద పెట్టిన పీడీ యాక్టు కేసును తీసివేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన భర్తను విడుదల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. మరి.. ఈ అంశంపై గవర్నర్ ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. హిందుత్వ ఎజెండాను బలంగా ప్రశ్నించిన రాజాసింగ్ ను బీజేపీ సైతం హ్యాండ్ ఇచ్చిందని.. తన వారిని కాపాడుకునే విషయంలో బీజేపీ ఎప్పుడూ కుడా సరిగా వ్యవహరించదన్న విమర్శ సోషల్ మీడియాలో కొందరు వ్యక్తం చేయటం గమనార్హం.