ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు తమ వంతు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఎన్నారైలు కదం తొక్కారు. ఇక, 2014-19 మధ్య కూడా అమరావతి రాజధానిలో ఐటీ కంపెనీలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు కూడా ఎన్నారైలు సంకల్పించారు. తమ సొంత డబ్బులతో ఏపీఎన్ ఆర్ టీఎస్ ఆధ్వర్యంలో అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ‘ఎన్ఆర్టీ ఐకాన్ టవర్’ నిర్మించాలని రంగం సిద్ధం చేశారు. 2018లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ టవర్ నిర్మాణం కోసం భూమి పూజ కూడా చేశారు.ఆ టవర్ లో ఫ్లాట్ లు కొనేందుకు 14 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయలు చెల్లించారు.
కట్ చేస్తే…2019లో వైసీపీ అధికారంలోకి రావడం..అమరావతిపై జగన్ కక్షగట్టడంతో రాజధానితో పాటు ఈ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ కూడా మూలనపడింది. అయితే, 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను రీస్టార్ట్ చేసింది. ఆ క్రమంలోనే తాజాగా ‘ఎన్ఆర్టీ ఐకాన్ టవర్’ నిర్మాణం కూడా పట్టాలెక్కనుంది. అందులో భాగంగా 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఆ భారీ ట్విన్ టవర్స్ భవనం ఫౌండేషన్ నిర్మాణం కోసం ఏపీఎన్నార్టీఎస్ టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలకు ఏప్రిల్ 10వ తేదీ వరకు గడువు విధించింది.
ఆంధ్రా రాజధాని అమరావతిలోని మొదటి ఆంగ్ల అక్షరం ‘A’ మాదిరిగా ఈ ఐకాన్ టవర్ ను నిర్మిస్తారు. రెండు టవర్ల మధ్యలో గ్లోబ్ ఉంటుంది. మొత్తం 11.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణం జరగనుంది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఐకాన్ భవనాన్ని మూడు దశలలో నిర్మించనున్నారు. మొదటి దశలో ఫౌండేషన్ నిర్మించి ఆ తర్వాత బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కోసం టెండర్లు పిలవబోతున్నారు. ఆ తర్వాత ఫసాడ్ అంటే అద్దాలతో, ఎలివేషన్లతో బయటకు కనిపించే అందమైన భాగం కోసం టెండర్లు పిలిచి నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు.
600 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ట్విన్ టవర్స్ గా వీటిని నిర్మించబోతున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు. ప్రవాసాంధ్రుల నిధులతోనే నిర్మించే ఈ భవనంలో ఫ్లాట్లను, ఆఫీస్ స్పేస్ ను ప్రవాసాంధ్రులకు మాత్రమే విక్రయించనున్నారు. ఈ టవర్స్ లో పార్కింగ్ కోసం రెండంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్థుల పోడియం ఉండనుంది. దానిపై 33 అంతస్తులలో భవనాన్ని నిర్మించబోతున్నారు. ఒక్కో టవర్ లో 29 అంతస్తులుంటాయి.
ఒక టవర్ లోని 29 అంతస్తులలో రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. ఒక్కో అంతస్తులో రెండు చొప్పున ఈ ప్లాట్లు ఉండబోతున్నాయి. మరో టవర్లో ఐటీ, ఐటీ సంబంధిత సేవలందించే ఆఫీసులు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ఆఫీసుల ఏర్పాటు వల్ల 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇక, ఈ రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగు అంతస్తులు నిర్మిస్తారు. కేవలం కమర్షియల్ అవసరాలకే వాటిని కేటాయిస్తారు. రెండు టవర్ల మధ్య ఏర్పాటు చేయబోయే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ గ్లోబ్ లో నాలుగు అంతస్తులు ఉంటాయి. రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో కూర్చుంటే 360 డిగ్రీస్ లో అమరావతి నగరం మొత్తం వీక్షించవచ్చు. ఈ గ్లోబ్ లో 10 నుంచి 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఎన్ ఆర్ టీ క్లబ్ హౌస్ ఉంటుంది.
పోడియంలోని మూడు అంతస్తులలో మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఫుడ్ కోర్ట్ వంటివి ఉంటాయి. ఇక, సమావేశాలు, సదస్సులు, కాన్ఫరెన్స్ ల నిర్వహణ కోసం 2000 సీట్ల కెపాసిటీతో ఆడిటోరియం, 1500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నారు.