సరిగ్గా ఏడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతానికి పునాది రాయి పడింది. 5 కోట్ల మంది ఆంధ్రుల కల నెరవేర్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడేళ్లు గడిచాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు పునాదులు పడింది ఈరోజే. ఈ నేపథ్యంలోనే ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాజధాని అమరావతి శంకుస్థాపన చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి గుండెచప్పుడుగా అమరావతి నిలుస్తుందని శంకుస్థాపన నాడు ప్రధాన మోడీ సహా అందరం ఆకాంక్షించామని గుర్తు చేసుకున్నారు. కానీ, జగన్ నుండి పాలకుల వల్ల అమరావతి సర్వనాశనం అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అంటే 33 వేల ఎకరాల భూమి కాదని 28 వేల మంది రైతుల త్యాగ ఫలితం అని చంద్రబాబు అన్నారు.
కానీ, ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు అన్న వ్యక్తి అధికారంలోకి రాగానే మాట మార్చిన వైనంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రైతుల పాదయాత్రపై వైసీపీ నేతల కుట్రలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీకి అమరావతి రాజధాని అని ఐదు కోట్ల ఆంధ్రులు ఆకాంక్షించారని గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, అమరావతి పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రైతులు ప్రకటించారు. పాదయాత్రను అడ్డుకుంటున్న పోలీసుల తీరుకు నిరసనగానే తాత్కాలికంగా యాత్రకు బ్రేక్ వేస్తున్నామని చెప్పారు. అంతేకాదు, పోలీసుల తీరును తీరును కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కోర్టుకు నాలుగు రోజుల పాటు పండుగ సెలవలు రావడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు.