`సార్ మీ కోసం.. లక్ష బిల్వార్చన చేయించాం`, `సార్ మీ కోసం లక్ష కుంకుమర్చన చేయించాం`, `సార్ మీరు కనుక ఆ ఆలయానికి ఒక్కసారి వెళ్తే.. గెలుపు మీదే. కోరుకున్న వరాలిచ్చేస్వామిగా .. ఆదేవుడికి పేరుంది`- ఇదీ.. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నాయకుల అనుచరులు చెబుతున్న మాట. ఇక, వీరి మాటను తీసేయలేక.. మనసులో ఉన్న సెంటిమెంటును కాదనలేక.. లెక్కకు మిక్కిలిగా నాయకులు గుళ్లు.. గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వీరిలో బీఆర్ ఎస్ నాయకులే కాదు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం వీలు కాని వారు.. సాయంత్రం పూజలకు రుసుము చెల్లించి ఏర్పాట్లు చేసు కున్నారు. ముఖ్యంగా చార్మినార్ పక్కన ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం .. శనివారం ఉదయం నాయకులతో పోటెత్తింది. చిత్రం ఏంటంటే.. అన్ని పార్టీల నాయకులు తండోపతండాలుగా వచ్చి.. ఒకరినొకరు పలకరించుకున్నారు.
నిన్న మొన్నటి వరకు కత్తులునూరుకున్న నాయకులు కూడా.. గుళ్లు గోపురాల విషయానికి వచ్చే సరికి.. ఆప్యాయంగా పలకరించుకుని.. ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించుకున్నారు. ఇక, సాయంత్రం పూజలకు రెడీ అయిన.. వారు ఆమేరకు షెడ్యూల్ మార్చుకున్నారు. ఇక, నాయకుల తరఫున జిల్లాల్లో పూజలు చేసే అనుచరులు కూడా పెరిగిపోయారు. దీనికి కూడా.. ఖర్చుల పేరిట నాయకుల నుంచి వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా.. గెలుపు మంత్రం ఒక్కటే ఏ గుడిలో అయినా.. వినిపిస్తున్న మాట. మరి నాయకులను ఏదేవుడు ఎలా కనికరిస్తాడో.. అనుగ్రహిస్తాడో చూడాలి.