మార్గదర్శిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. #TeluguPeopleWithRamojiRao ను రామోజీ రావుకు మద్దతుగా లోకేష్ ట్రెండ్ చేశారు. మార్గదర్శిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు జగన్ రెడ్డి తన పదవిని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని లోకేష్ విమర్శించారు.
‘‘పాలకుల అవినీతిని, అసమర్ధతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థల పై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారు. తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ తన పగ తీర్చుకోవడం కోసం జగన్ వాడుకోవడం చూస్తే… ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోంది. ఇదంతా చేస్తున్నది ప్రజల శ్రేయస్సు కోసమే అనుకుంటే పోలవరం కట్టండి. రాజధాని అమరావతిని నిర్మించండి. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైకాపా నేతల పై చర్యలు తీసుకోండి. అంతేకానీ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి. రామోజీరావు గారికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
ఇక, ఈ కేసులో జగన్ రెడ్డి కొండను తవ్వి చివరికి ఎలుకను కూడా పట్టుకోలేకపోయిందని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎద్దేవా చేసింది. జగన్ దోపిడీలను ఈనాడులో ఎత్తిచూపుతున్నందుకే రామోజీరావుపై కక్ష సాధిస్తున్నారని నెటిజన్లు మీడియాలో పోస్టులను ట్రెండ్ చేస్తున్నారు. మార్గదర్శి సంస్థ అక్రమాలకు పాల్పడి ఉంటే ఆ ఆధారాలను జగన్ ప్రభుత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ముందు ఎందుకు ఉంచడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2007లో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ తరహా లోనే రామోజీపై పడ్డారని, చివరకు ఆధారాలు చూపించలేక భంగపడ్డారని, ఆయన కొడుకు జగన్ పరిస్థితి కూడా అంతే అవుతుందని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఒక్కరంటే ఒక్క డిపాజిట్ కూడా జగన్ మాటలు నమ్మడం లేదని అది రామోజీరావుకి ఉన్న క్రెడిబిలిటీ అని పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ప్రజాగళాన్ని అణచివేసేందుకు మార్గదర్శిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు జగన్ రెడ్డి తన పదవిని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని కామెంట్లు వస్తున్నాయి.
అంతకుముందు, ఈ వ్యవహారంలో ఏపీ సిఐడి అధికారులు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దర్యాప్తు నిమిత్తం మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ పై లుక్ ఔట్ సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చిందన్న సిఐడి అధికారుల వాదనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. శైలజ కిరణ్ పై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా ధిక్కరించి జారీ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి 1000 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయడంపై కూడా విచారణ జరిగింది. ఈ రెండు అంశాల పైన కోర్టు ధిక్కరణ జరిగిందంటూ ఏపీ సిఐడి అధికారులపై, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని శైలజ కిరణ్ పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితులు ఏమైనా నోటీసులు జారీ చేయడం సరికాదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారాలపై విచారణను సెప్టెంబర్ 15 కు వాయిదా వేసింది.