పేరుకే మీడియా లో ఉద్యోగం. చాలీచాలని జీతాలతో బతుకుబండి లాగించే జర్నలిస్టుల కష్టాలకు అన్నిఇన్ని కావు. నెల మొత్తం గొడ్డు చాకిరీ చేసిన తర్వాత వచ్చే జీతం రాళ్ల కోసం ఆశగా ఎదురుచూసే వైనాలు కోకొల్లలు. కొన్ని మీడియా సంస్థలైతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వవు. ఇలాంటివి సహజమే. జర్నలిస్టులకు జీతాలు ఇచ్చే విషయంలో అమితమైన పొదుపును పాటించే సంస్థల కారణంగా అందులో పని చేసే ఉద్యోగుల బతుకులు మారకున్నా.. ఆయా యజమాన్యాలు మాత్రం రాయల్ గా బతికేస్తుంటాయి. అందుకు భిన్నంగా సుమన్ టీవీ (యూట్యూబ్ చానల్) మాత్రం భిన్నంగా వ్యవహరించింది. మీడియా చరిత్రలో తొలిసారి.. ఉద్యోగులను వరుస వరాలతో ముంచెత్తింది.
సుమన్ టీవీ 8వ వార్షికోత్సవంలో భాగంగా ఆ చానల్ లో పని చేస్తున్న ఆరుగురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతిగా ఇవ్వటమే కాదు.. వారి జీతాల్ని ఏకంగా నెలకు రూ.5 లక్షల చొప్పున పెంచేసింది. వారిని ఆయా విభాగాలకు సీఈవోలుగా చేసేసింది. అక్కడితో ఆయిపోలేదు. వారికి రూ.కోటి బీమాను సంస్థే కట్టేలా నిర్ణయం తీసుకుంది. జెమినీ టీవీలో ఎడిటింగ్ విభాగంలో చిరుద్యోగిగా తన కెరీర్ ను షురూ చేసిన సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ దూది తీసుకున్న తాజా నిర్ణయం మీడియా వర్గాల్లో సంచలనంగా మారటమే కాదు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకు మీడియా సంస్థలు ఏవైనా సరే.. జర్నలిస్టుల నుంచి తీసుకోవటమే కానీ ఇచ్చింది లేదు. అందుకు భిన్నంగా తొలిసారి ఊహించనంత భారీగా రిటర్న్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగామారింది. సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నజరానాను ఉద్యోగులకు అందించింది. సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన రోషన్ ను ఎంటైర్టైన్మెంట్ విభాగానికి సీఈవోగా చేస్తే.. న్యూస్ విభాగానికి సీఈవోగా యాంకర్ నిరుపమను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉమెన్ వింగ్ సీఈవోగా జయలక్ష్మి.. బిజినెస్ సీఈవోగా నాగరాజు.. లైఫ్ స్టైల్- అధ్మాత్మిక విభాగానికి జయలక్ష్మి.. హెల్త్ సీఈవోగా సుదర్శన్ ను నియమిస్తూ నిర్ణయాన్ని ప్రకటించటమే కాదు.. వారికి బహుమతిగా ఇచ్చిన బెంజ్ కార్ల విలువ ఒక్కొక్కటి రూ.62లక్షలు కాగా.. వారికి నెలసరి జీతాన్ని రూ.5 లక్షలు.. రూ.కోటి బీమా పాలసీని వారికి అందిస్తూ సత్కరించారు.
ఈ సందర్భంగా యాంకర్ నిరుపమ ఎమోషనల్ అయ్యారు. తమ ఛైర్మన్ పది రూపాయిలు సంపాదిస్తే అందులో రూ.6 ఉద్యోగులకు.. రూ.2 ఛారటీకి ఇచ్చి.. మిగిలిన రూ.2 మాత్రమే తాను తీసుకుంటారని.. అదీ ఆయన గొప్పతనమని కీర్తించారు. సుమన్ టీవీ చానల్ ఉద్యోగులకు ఇచ్చిన నజరానాలు.. మీడియా చరిత్రలోనే కాదు.. టాప్ మీడియా సంస్థల్లో పని చేసే అత్యున్నత ఉద్యోగులకు కూడా ఇవ్వట్లేదన్న చర్చ మీడియా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.