రోజురోజుకు తెలుగు మీడీయా ఓవర్ యాక్షన్ మరీ మితిమీరిపోతోంది. చాలా ఛానళ్ళల్లో కనీస అవగాహన కూడా లేని రిపోర్టర్లను పెట్టుకోవటమో లేకపోతే డెస్క్ లోని వాళ్ళ అత్యుత్సాహమో తెలీదు కానీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నానా గొడవైపోయింది. ఉదయం కౌంటింగ్ మొదలవ్వటం ఆలస్యం కొన్ని చానళ్ళల్లో గ్రేటర్ పీఠం అందుకునే దిశగా కమలంపార్టీ అంటూ ఒకటే ఊదరగొట్టేశాయి. సగానికి పైగా డివిజన్లలో దూసుకుపోతున్న బీజేపీ అంటు నానా గోల మొదలుపెట్టేశాయి చానళ్ళు.
ఈ చానళ్ళల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ నిజమనుకుని జాతీయ చానళ్ళు కూడా వాటినే క్యారీ చేసేశాయి. ఇంకేముంది ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతల్లో కూడా ఒకటే హడావుడి మొదలైపోయింది. గ్రేటర్ పీఠాన్ని బీజేపీ గెలిచేసినట్లే అంటు ఢిల్లీలో సంబరాలు కూడా మొదలైపోయాయట. హైదరాబాద్ లో చూస్తేనేమో పరిస్దితి రివర్సులో ఉంది. విషయం ఏమిటో అర్ధంకాక చాలామంది జనాలు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇంతటి గందరగోళానికి కారణం ఏమిటయ్యా అంటే పోస్టల్ బ్యాలెట్లలో కమలంపార్టీకి వచ్చిన మెజారిటి.
ఉదయం కౌంటింగ్ మొదలవ్వటమే పోస్టల్ బ్యాలెట్లతో మొదలుపెట్టారు. అందులో వచ్చిన 1926 బ్యాలెట్లలో బీజేపీకి మెజారిటి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటి వస్తే గ్రేటర్ పీఠం దక్కించుకున్నట్లేనా ? ఇక్కడే అవగాహన లేని మీడియా వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఫలితంగానే ఢిల్లీ స్ధాయిలో నానా గొడవైపోయింది. వివిధ డివిజన్లలోని పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినపుడు బీజేపీకి 88 డివిజన్లలో మెజారిటి వచ్చింది వాస్తవమే. అయితే పోస్టల్ బ్యాలెట్లతోనే గ్రేటర్ లో విజయం ఎవరిదో తేలిపోదు కదా ? ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత అసలు ఓట్ల లెక్కింపు మొదలవుతుందన్న చిన్న విషయం కూడా తెలీలేదు.
అసలు ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత కానీ జాతీయ ఛానళ్ళకు విషయం అర్ధంకాలేదు. అంటే దాదాపు బ్రేకింగ్ న్యూస్ పేరుతో దాదాపు మూడు గంటలు చానళ్ళు చేసిన హడావుడినే జాతీయ చానళ్ళు కూడా క్యారీ చేశాయి. ఆ తర్వాత విషయం అర్ధమైన చానళ్ళు తమ బ్రేకింగులను అర్జంటుగా మార్చేశాయి. అలాగే ఒకవైపు వివిధ పార్టీల గెలుపును బ్రేకింగుల రూపంలో చూపెడుతునే మళ్ళీ లీడ్స్ అనే హెడ్డింగుల్లో కూడా 150 డివిజన్లను చూపించాయి. పార్టీలు గెలిచిన డివిజన్లు ప్రకటించేసిన తర్వాత లీడ్సులో నుండి గెలిచిన డివిజన్లను తీసేయకుండా కంటిన్యు చేయటం వల్ల చాలామంది జనాల్లో అయోమయానికి గురయ్యారు. మొత్తానికి తెలుగు మీడియా ఓవర్ యాక్షన్ వల్ల జాతీయ మీడియాతో పాటు మామూలు జనాలు కూడా చాలా ఇబ్బందులే పడ్డారు.