విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ దివంగత మహానేత నందమూరి రామారావు శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. శక పురుషుడి శత జయంతి వేడుకలు పేరుతో టీడీపీ, ఎన్నారై టీడీపీ ఈ వేడుకలను గత ఏడాది ఏప్రిల్ 28 నుంచి ఈ ఏడాది మే 28 వ తేదీ వరకు ఊరూ వాడా..దేశ విదేశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన అన్నగారి శత జయంతి సందర్భంగా తెలుగోడికి అమెరికాలో మరో అరుదైన గౌరవం దక్కింది. మే 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ‘తెలుగు హెరిటేజ్ వీక్’ గా నార్త్ కరోలినా రాష్ట్ర గవర్నర్ రాయ్ కూపర్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఈ అరుదైన గౌరవం దక్కడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఇది ఎంతో శుభవార్త అని అన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇది స్వాగతనీయం అని, ప్రపంచ చిత్రపటంలో తెలుగు సమాజానికి దక్కిన మరో గుర్తింపు ఇది అని కొనియాడారు. ఈ గుర్తింపునిచ్చిన గవర్నర్ రాయ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల చార్లోటే నగరం మే 28వ తేదీని తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, 2023, మే 28వ తేదీని ‘‘తెలుగు వారసత్వ దినం’’ (TELUGU HERITAGE DAY)గా టెక్సాస్ లో ఉన్న ఫ్రిస్కో నగర్ మేయర్ జెఫ్ షెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకటించడంపై ఎన్నారైలు, తెలుగువారు హర్షం వ్యక్తం సంగతి తెలిసిందే. శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” గ్రెగ్ అబ్బాట్ ప్రకటించారు.