దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక సంచలనం. తెలుగుజాతికి నవోదయం. సామాన్య రైతు బిడ్డ స్థాయి నుండి తెలుగు సినీరంగ అగ్రశ్రేణి కథానాయకుడి స్థాయి వరకు ఎదిగిన నందమూరి తారక రామారావు గారు.. తనను వెండితెర వేలుపుగా పూజించిన ప్రజల ఋణం తీర్చుకునేందుకు రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, సామాన్యుడి చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదలకు ఆనందంగా జీవించే హక్కును కల్పించడానికి ఎన్టీఆర్ గారు 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగుదేశం పార్టీని స్థాపించి చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరి పోశారు.
పార్టీ ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నేటికి తెలుగుదేశం పార్టీ 43 వసంతాలను పూర్తి చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరూ వాడవాడలా టీడీపీ జెండాను రెపరెపలాడిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. “ 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ. ‘అన్న’ నందమూరి తారకరామారావు గారి దివ్య ఆశీస్సులతో…సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం. పీకపై కత్తిపెట్టినా `జై తెలుగుదేశం` నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా.. తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా.. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా.. ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా.. రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా.. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా… మన పసుపు జెండా “ అని చంద్రబాబు కొనియాడారు.
“ దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి…తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తూ…చారిత్రాత్మక దినమైన నేటి రోజున…ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం…జోహార్ ఎన్టీఆర్! “ అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.