అవును.. మనోడు మరో ఘనతను సాధించారు. ఇప్పటికే విశ్వ వేదికల మీద మనోళ్లు తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్.. సర్ఫేస్ సంస్థకు అధిపతిగా నియమితులయ్యారు. ఈ బాధ్యతల్ని గతంలో నిర్వహించిన వ్యక్తి అమెజాన్ కు వెళ్లటంతో తాజాగా పవన్ దావులూరిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో విండోస్.. సర్ఫేస్ గ్రూప్ లను విడదీసి.. వారికి వేర్వేరు వ్యక్తుల్ని అధిపతులుగా ఉంచేవారు. అందుకు భిన్నంగా తాజాగా విండోస్ ను.. సర్ఫేస్ ను కలిపేశారు. రెండు విభాగాల బాధ్యతల్ని పవన్ కు అప్పజెప్పారు. ఇతగాడు మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లకు నేరుగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
23 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న పవన్ దావులూరికి తాజాగా లభించిన గుర్తింపు ఆయన మరోస్థాయికి వెళ్లేలా చేస్తుందని చెబుతున్నారు.టెక్ దిగ్గజాలకు నాయకత్వ హోదాలో పని చేస్తున్న భారత సంతతి వ్యక్తులైన సుందర్ పిచాయ్.. సత్య నాదెళ్ల సరసన పవన్ దావులూరి చేరినట్లుగా చెప్పాలి. మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక మైక్రోసాఫ్ట్ రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్ గా చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ తాజాగా కీలక స్థానానికి ఎంపికయ్యారు.