సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేసిన ‘టెలిగ్రామ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో దిగ్గజ సోషల్ మీడియాల్లో ఒకటైన టెలిగ్రామ్.. ఫేస్ బుక్.. యూ ట్యూబ్.. వాట్సాప్.. ఇన్ స్టా.. టిక్ టాక్.. స్నాప్ చాట్ లకు సమానంగా అనేక దేశాల్లో దీని కంటూ ప్రత్యేక ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంకు భిన్నంగా ఉండే ఈ వేదిక ఫౌండర్ కం సీఈవో పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని బోర్గెట్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న దానిపై స్పష్టత రాలేదు.
తన ప్రైవేట్ జెట్ లో ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అజర్ బైజాన్ లోని బాకు ఎయిర్ పోర్టు నుంచి తన ప్రైవేట్ జెట్ లో బయలుదేరిన అతను.. ఒక కేసులో కోర్టులో హాజరు కావాల్సి ఉంది. తమ ఫౌండర్ కం సీఈవో అరెస్టుపై టెలిగ్రామ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ అరెస్టుపై రష్యా బ్లాగర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాల వెలుపల నిరసనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. టెలిగ్రామ్ లో మోడరేటర్లు లేకపోవటంపై ఫ్రెంచ్ పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం.
టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. సైబర్ నేరాలు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సమించినందుకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. తన సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాంను నేరపూరిత వినియోగాన్ని అరికట్టటంలో ఫెయిల్ అయిందని.. అందుకు అతడ్ని అరెస్టు చేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 39 ఏళ్ల టెలిగ్రామ్ సీఈవో అరెస్టు అంశం సంచలనంగా మారింది.
టెలిగ్రామ్ సీఈవో అరెస్టుపై రష్యా ఎంబసీ రియాక్టు అయ్యింది. పరిస్థితులపై మరింత అవగాహన.. స్పష్టత కోసం చర్యలు చేపట్టామని పేర్కొంటూ.. తాము ఇప్పటివరకు టెలిగ్రామ్ సిబ్బందితో మాట్లాడలేదని పేర్కొంది. టెలిగ్రామ్ సీఈవోను అరెస్టు చేసిన వైనం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పలువురు పావెల్ దురోవ్ కు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. నిజాన్ని సెన్సార్ చేయకపోవటంతోనే అతన్ని అరెస్టు చేశారన్న వ్యాఖ్యల్ని నెటిజన్లు చేస్తున్నారు.
2013లో టెలిగ్రామ్ ను రష్యాలో ప్రారంభించారు దురోవ్. రష్యా.. ఉక్రెయిన్ తో పాటు నాటి సోవియెట్ యూనియన్ లోని పలు దేశాల్లో ఈ యాప్ చాలా ఫేమస్. టెలిగ్రామ్ ఫౌండర్ కు చెందిన మరో యాప్ ఉంది. అదే.. వీకొంటక్టే. తొలుత తనతోనే ఉంచుకున్న ఈ యాప్ ను తర్వాతి కాలంలో అమ్మేశారు. కారణం.. ఇందులో విపక్షాల కమ్యూనిటీలను నిషేధించాలని రష్యా ప్రభుత్వం చేసిన ఒత్తిడి అంతకంతకూ ఎక్కువైంది. దీంతో అతను 2014లో రష్యాను విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత దుబాయ్ కు షిప్టు అయ్యారు.
తన మీద చాలా ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి కానీ టెలిగ్రామ్ అనేది ఒక తటస్థ వేదికగా ఉండాలన్నదే అతడి ఆశయంగా చెబుతారు. యూజర్ డేటాను ఇవ్వని కారణంగా 2018ల టెలిగ్రామ్ పై రష్యా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే.. 2021లో ఆ బ్యాన్ ను ఎత్తేసింది. వచ్చే ఏడాదికి ఒక బిలియన్ యూజర్ మార్క్ ను టచ్ చేయాలన్న లక్ష్యం టెలిగ్రామ్ కు ఉందని చెబుతారు. ఇందులోనే ఇలా జరిగింది.
ఇదిలా ఉంటే.. భౌగోళిక రాజకీయాలకు బానిస కాకూడదని చెప్పే ఇతడికి సంబంధించిన మరో అంశం ఇటీవల కాలంలో సంచలనంగా మారింది. ఈ మధ్యన సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్టులో.. తనకు 12 దేశాల్లో వందకు పైగా బయలాజికల్ సంతానం ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన పిల్లలు ఒకరినొకరు మరింత సులువుగా కనుగొనటానికి వీలుగా తన డీఎన్ఏను ఓపెన్ సోర్సింగ్ చేస్తానని చెప్పి హాట్ టాపిక్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పావెల్ దురోవ్ పైన అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పారిస్ కు రావటంపై అక్కడి విచారణ అధికారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని ఈ రోజు (ఆదివారం) కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.