తెలంగాణలో ప్రభుత్వం మారింది. తమనే గెలిపిస్తారని.. తాము చేసిన అబివృద్ధి దేశంలో ఎక్కడా ఎవరూ చేయడం లేదని.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని. పదే పదే చెప్పుకొన్న కేసీఆర్ను ప్రజలు పక్కన పెట్టేశారు. ఎన్నో సెంటిమెంట్లు ప్లే చేసినా.. వాటిని కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండు అంశాలను కీలకంగా తీసుకున్న కేసీఆర్.. అవైనా తమను గట్టెక్కిస్తాయని అనుకున్నారు. అయితే.. అవి కూడా ఫలించలేదు.
అవే.. ఒకటి సర్వేలు. రెండు సొంత మీడియా. సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికలకు ఆరు మాసాల నుంచి అనేక సర్వేలు చేయించారు కేసీఆర్. తను సొంతగా చేయించుకున్న సర్వేతోపాటు.. ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా.. ఆయన అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరు.. పథకాల జోరు.. ప్రజల నాడిని పట్టుకునేందుకు .. కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతేకాదు.. ఇంటిలిజెన్సును కూడా గ్రామ గ్రామానా తిప్పారు. అయితే.. సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగానే వచ్చాయి.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ .. ఇదే సర్వేలు వచ్చాయి. దీంతో కాదని అన్న స్థానాల్లోనూ సిట్టింగులకే సీట్లు ఇచ్చారు. తీరా ఫలితం రివర్స్ అయింది. మరోవైపు.. కేసీఆర్కు సొంత మీడియా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే (ఇంగ్లీష్) పత్రికలతోపాటు.. టీ న్యూస్ మీడియా కూడా ఉంది. ఈ మీడియా ద్వారా.. నిరంతరం.. కేసీఆర్పై కథనాలు ప్రచారం చేశారు. అభివృద్ధిని వివరించారు. ఇక, సెంటిమెంటుకు హద్దు అదుపు లేకుండా చేశారు. అయినా.. ప్రజలు వీటిని పట్టించుకోలేదు.
కట్ చేస్తే.. ఏపీలోనూ వైసీపీ ప్రభుత్వం ఈ రెండింటినే బాగా నమ్మిందనే ప్రచారం జరుగుతోంది. పైకి.. తనకు ఎలాంటి మీడియా లేదని చెబుతున్నా.. సీఎం జగన్కు సాక్షి పత్రిక, చానెల్ ఉన్నాయి. వీటితోపాటు అనుకూల మీడియా కూడా ఉంది. ఇక, సర్వేలకు లోటు లేదు. అనేక సర్వేలు చేయించారు. వలంటీర్లు, గృహసారథులతోపాటు.. ఐప్యాక్ సర్వేలు కూడా తెప్పించుకున్నారు. మరి వీటి ప్రకారం మార్పులు చేర్పులు చేస్తారా? లేదా.. ఏం చేస్తారనేది చూడాలి. కానీ, తెలంగాణలో వచ్చిన ఫలితాన్ని చూస్తే.. సర్వేలు.. సొంత మీడియా కాపాడుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.