తెలంగాణలో పైకి కనిపించడానికి అంతా కేసీఆర్ కంట్రోల్లేనే ఉన్నట్టున్నా… వాస్తవాలు వేరుగా ఉన్నట్టు పరిస్థితులు చెబుతున్నాయి.
ఇసుకాసురులు లాభాల కోసం ఎంతకైనా తెగించేలా ఉన్నారు. రాజకీయ నేతలకు అత్యధిక ఆదాయం తెచ్చేవి మద్యం, ఇసుక ఈ రెండే. అందుకే వీటిని వదులుకోవడానికి వారు ఎపుడూ ఇష్టపడరు.
తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటనే దీనికి సాక్ష్యం.
ఇసుక మాఫియా ఎంతకు తెగించింది అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపైనే తిరగబడింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మల్లాపూర్ మండలం వేంపల్లి శివారులోని వాగుకు వెళ్లిన పోలీసులు మాఫియా చేతిలో దెబ్బలు తిన్నారు.
పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేస్తుండగా… పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బయపడి పారిపోవాల్సిన వారు ఏకంగా తిరగబడి దాడి చేశారు. ఇసుక మాఫియా కర్రలు, రాళ్లతో పోలీసులను చితకబాదింది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
వారు సొమ్మసిల్లి పడిపోవడంతో అక్రమ రవాణా చేస్తున్నవారు వాహనాలను అక్కడే వదిలేసి పారిపోయారు. ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, స్టేషన్ కు తరలించారు.
దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.