కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) నిర్మాణాన్ని జగన్ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ప్రాజెక్టును జగన్ ఏపీకి తెచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెబుతున్నారు. అయితే, ఆ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కృష్ణా జలాల ఆధారంగా పంప్డ్ స్టోరేజీ కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతులివ్వడం పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85లకు విరుద్ధమని స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించాలని కోరింది. ఈ ప్రకారం కేఆర్ఎంబీ/అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన అన్ని కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలంటూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
అంతేకాదు, ఈ ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనులు నిలిపివేయాలని గతంలో రెండు సార్లు లేఖ రాశామని గుర్తు చేశారు. గతంలో పలుసార్లు ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఈ వ్యవహారంపై ఏపీ నీటిపారుదల శాఖాధికారుల వాదన మరోలా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాల్వ ద్వారా గోరకల్లు రిజర్వాయర్‌కు నీళ్లు వస్తాయని వారు చెబుతున్నారు.
ఆ నీళ్లను మిగులు విద్యుత్ ఉండే సమయాల్లో మరో రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారని, ఇందుకోసం కొత్త రిజర్వాయర్‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నామని అంటున్నారు. విద్యుత్ కొరత ఉండే వేళల్లో ఈ కొత్త జలాశయం నుంచి నీళ్లను జలవిద్యుదుత్పత్తి ద్వారా దిగువన ఉండే గోరకల్లు రిజర్వాయర్‌కు మళ్లీ విడుదల చేస్తారని వివరణనిస్తున్నారు.
కొత్త రిజర్వాయర్‌పై జలవిద్యుత్ కేంద్రం సైతం నిర్మిస్తున్నారని, పంప్డ్ స్టోరేజీ పద్ధతిలో విద్యుత్‌ను నిల్వ చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని అంటున్నారు. వరద జలాల ఆధారంగా హంద్రీ నీవా-సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులున్న నేపథ్యం లో ఈ పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తావు లేదని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్, కేసీఆర్ ల మధ్య జల జగడానికి ఇది మరో నిదర్శనమని, జగన్ కు కేసీఆర్ కు చెడిందన్న వాదనలకు ఈ వ్యవహారం ఊతమిస్తోందని అనుకుంటున్నారు.